పుట:Loochupu-fr.Jojayya.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలుగుతుంది. భయమూ, విచారమూ, దిగులూ పుట్టుక వస్తాయి. కర్తవ్యంబోధపడదు. అపుడు "ధైర్యం" అనే మనోభావం మనలో మేల్కొని మనం మళ్లా పనికి పూనుకొనేలా చేస్తుంది. ఈలా మనోభావాలను మనలను కార్యోన్ముఖులను చేస్తుంటాయి. మనకు ఆశయాలు, విలువలూ, ఆసక్తులూ కలిగించేది కూడ ఈ మనోభాలే. గుర్రపు బండికి కట్టిన గుర్రం పరుగుదీస్తుంటుంది. బండిని లాగుకొని పోతూంటుంది. మనోభావాలు కూడా మన మనుగడ అనే బండిని ఓ గుర్రంలాగలాగుకొని పోతూంటాయి. అవి లేందే జీవితం హుషారుగా వుండదు. కొందరిలో ఈ మనోభావాలు నిండుగా వుంటాయి. వాళ్ల ముఖం కలకలలాడుతూంటుంది. ఉత్సాహం మిన్నులు ముట్టుతుంటుంది. వాళ్లు నిత్యం ఏదో పనికి పూనుకొంటూంటారు. చాలవరకు విజయం సాధిస్తుంటారు గూడ. ఈలాంటి వాళ్లతో మెలగాలంటే ఆసక్తికరంగా ఉంటుంది. వీళ్లచుటూ ఎప్పడూ పదిమంది మూగుతుంటారు. కాని కొంతమందిలో అనేక కారణాల వల్ల ఈ మనోభావాలు అట్టే పనిచేయవు. అవి వట్టి పోతాయి. వాళ్లకు జీవితం అంత ఉత్సాహంగా ఉండదు. వాళ్ల పోకడలు కూడ అంత సహజంగా ఉండవు. వీళు ఇతరులను ప్రోత్సహించలేరు. ఇతరులు వీళ్ల వద్దకు అట్టే రారు కూడ. ఈ రెండు రకాల మనస్తత్వాలకు కారణం మనోభావాలు పనిచేసే తీరేనని చెప్పాలి. ఈ భావాలు ఎవరిలో నిండుగా పనిచేస్తాయో వాళ్లకు గొప్ప వ్యక్తిత్వం వుంటుంది. వాళ్లు సహజమైన మానవ జీవితం జీవిస్తుంటారు గూడ.

4. సంయమనం


కృష్ణా గోదావరి లాంటి గొప్పనదులు ఉద్దృతంగా పారుతుంటాయి. కాని ఆనకట్టలు కట్టి అదుపులోనికి తెచ్చుకుంటే ఈ నదీజలాలు ఎంతో మేలు చేస్తాయి. అలా కాకుండ స్వేచ్ఛగా ప్రవహింపనిస్తే ఈ యేరులు పొలాలకు కీడు చేస్తాయి. మనలోని మనోభావాలు ఇంతే. ఇవి గొప్ప శక్తులు అని చెప్పాం. కాని యీ శక్తులను మనం నిత్యం అదుపులో పెట్టుకొంటూండాలి. ఉదాహరణకు కోపమనేది ఓ మనోభావం. మనలో