పుట:Loochupu-fr.Jojayya.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్సాహమూ, ఉల్లాసమూ, నవ్వూ మొదలైన భావాలు కలుగుతాయి. దీనికి వ్యతిరేకమైన దుఃఖం నుండి విచారమూ, వ్యాకులతా, కుమిలిపోవడమూ మొదలైన భావాలు జనిస్తాయి. 4. ఆశనుండి ఎదురుచూడ్డమూ, నమ్మకమూ, తృష్ణా మొదలైనవి పడతాయి. దీనికి వ్యతిరేకమైన నిరాశనుండి నిరుత్సాహమూ, ఆందోళనమూ, శంకా మొదలైనవి కలుగుతాయి. 5. ధైర్యం నుండి జిగీషా, అధికారం చెలాయించడమూ కార్యసాధనవాంఛా మొదలైనవి కలుగుతాయి. దీనికి వ్యతిరేకమైన భయం నుండి కంపమూ, బెండుపడిపోవడమూ, బిక్కపోవడమూ మొదలైన భావాలు కలుగుతాయి. 6. శాంతం నుండి నెమ్మదీ, నిబ్బరము అనే భావాలు పుడతాయి. దీనికి వ్యతిరేకమైన కోపం నుండి ద్వేషమూ, మనసు నొచ్చుకోవడమూ, పగ అసూయ, నింద మొదలైన భావాలు కలుగుతాయి. ఇలా మన హృదయ సరోవరంలో రకరకాలైన మనోభావాలు నిరంతమూ అలల్లాగ చెలరేగుతుంటాయి. వీటివల్లనే మనం దుఃఖాలకు, కోపతాపాలకు గురౌతుంటాం. క్షణక్షణం మారిపోతూంటాం. "అడుగుకి అరవై ఆరు గుణాలు" అనే సామెత ఈ మనోభావాలు విపరీతంగా పనిచేసేవాళ్లకు వర్తిస్తుంది. 3. మనోభావాలు ఏం చేస్తాయి ?

మనోభావాలు మనలో పనిచేసే గొప్ప క్రియాశక్తులు. అవి మనలో ఉద్రేకమూ, ఉత్సాహమూ, చైతన్యమూ రేకెత్తిస్తాయి. మనలను చలింపజేస్తాయి. కార్యాభిలాషను పుట్టిస్తాయి. అవి పురికొల్పందే మనం ఏ పనికీ పూనుకోం. ఉదాహరణకు తొలకరివానలు కురవగానే సేద్యగాడు పొలం పని ప్రారంభించాలి. పంటలు పండించాలి. కాని సేద్యం చేయడం కష్టం. అందుచేత అతడు పనికి జంకుతుంటాడు. కార్యారంభానికి పూనుకోడు. అపుడు "ఆశ" అనే మనోభావం అతనిలో ఉప్పతిల్లి అతనిచేత సేద్యం చేయిస్తుంది. పంటలు పుష్కలంగా పండుతాయి. పొట్టపోసికోవచ్చు. డబ్బు చేసికోవచ్చు అనే ఆశతో సేద్యగాడు పనికి పూనుకొంటాడు. అలాగే మనకేవో ఆపదలూ ఇబ్బందులూ వచ్చి బెండుపడిపోతాం. నిరుత్సాహం