పుట:Loochupu-fr.Jojayya.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధించలేని వ్యక్తులు ఈలా ఊహామాత్రపు విజయాలను కల్పించుకొని కొంతవరకైనా సంతృప్తి చెందుతుంటారు. 6. విపరీతంగా అనుమానపడ్డం కూడ కద్దు. ఈలాంటివాళ్లు ఎవరు ఏమి మాటలాడుకొంటున్నా ఎవరు దేన్ని గూర్చి నవ్వుకొంటున్నా తమ్ము గూర్చే కాబోలు అని శంకిస్తుంటారు. బాధ చెందుతూంటారు. పైగా వాళ్లు “మనలను జూచి ఇతరులు ఏమనుకొంటారో" అనే భావానికి కూడ లొంగిపోతారు.

7. కుమిలిపోతుంటారు. తాము విజయం సాధించలేదే అని విచారిస్తుంటారు. ఇతరులతో పోల్చి చూచుకొని వాళ్లకు కార్యం సిద్ధించింది మనకు సిద్ధించలేదు అని అసూయతో వ్రుగ్గిపోతుంటారు.

8. హైన్య భావాలవల్ల బాధపడేవాళ్లు సులభంగా పరవిమర్శకు దిగుతుంటారు. ఇతరుల విజయాలను అంత తేలికగా అంగీకరించరు. వాళ్లల్లో ఏవేవో లోపాలను చూపుతుంటారు. పరనిందా అసూయా ప్రదర్శిస్తూంటారు. మళ్లా వాళ్లనే ఎవరైనా విమర్శిస్తే ఎంతో బాధపడిపోతారు. ఎవరైనా తమ్మ పొగడితే మాత్రం చాల సంతోషిస్తారు. ఈలాంటివాళ్లు తమ్ముతామే విమర్శించుకోవడమూ, తమమీద తామే అసహ్యం చెందటం కూడ కద్దు. నేనెందుకు పనికిరానివాణ్ణి, నా కేమి కలసిరాలేదు అనే భావాలు వీళ్లల్లో తెప్పలుగా పుట్టుకొస్తాయి.

3. కారణాలు

అసలు హీనతా భావాలు ఏలా అలవడతాయి? మనం చిన్నపిల్లలంగా ఇంట్లో పెరుగుతున్నప్పడుగాని, బళ్లో చదువుకూంటున్నప్పడు గాని, ఈ భావాలు కలుగవచ్చు. సమాజం వల్లకానీ, వ్యక్తిగత లక్షణాలవల్లకానీ, ఈ గుణాలు ఏర్పడవచ్చు. కనుక ఈ నాలుగు లక్షణాలను పరిశీలించి చూద్దాం. 1. ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే అమ్మానాన్నావాళ్లల్లో ఇద్దరిని మాత్రమే ఆప్యాయంగా జూచి ఒకరిని అశ్రద్ధ చేయడం కద్దు. అలా అశ్రద్ధ చేయబడిన బిడ్డడు బాధచెందుతాడు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను నిత్యం తిడుతుంటారు. మా కుర్రవాడు వట్టి మొద్దు అని చెపుతూంటారు. వాడు చివరకు అలాగే అయిపోతాడు. ఇంకా కొందరు తల్లిదండ్రులు తమ