స్థలం మూడు] కుంభ రాణా 15
రాణా : నన్నుచూచి యేల మరలుచున్నారు ? ఈ ప్రాకృతుని గాలిసోఁకిన పంచమహాపాతకములు మిమ్మంటుకొను ననియా ?
మీరా : అయ్యో! నాయపరాధమును మన్నింపుఁడు. మీరేదో యాలోచనలో మునిఁగియున్నటుల తోఁచినది. మాసందడి మీ యవధానమునకు అంతరాయము కావచ్చునను తలంపుతో తొలఁగిపోయితిమి.
రాణా : [విషపు చిఱునవ్వుతో] అనుకూలవతివి !
మీరా : నా సదుద్దేశము నేల యనుమానించుచున్నారు ? ఎపుడైన మీకనిష్ట మాచరించితినా ? నాసతీత్వమున కేమైన లోపమువాటిల్లెనా?
రాణా : మీరా, ఆయుపచారవాక్యముల నటుండనిమ్ము. సతులు నిరంతర వ్రతోపవాస కృశాంగులేకారు, కేవలము విధినియమబద్ధ సంబంధ లేకారు; పతుల హృదయము లాకర్షించు సమ్మోహన మంత్రాధి దేవతలు గను. మృదుమధుర స్వభావలుగ నుండవలయును. పరస్పర హృదయైక్యములేని వైవాహిక బంధము నీరసము - సంతాపకరము - హత్యాకరము. కృశాంగీ, కడచిన యేడెనిమిది సంవత్సరములు వేఱు. మున్నటి లావణ్యవతి వేనా నీవు ?
కాటుక జిగి పూఁత కాఱుచీఁకటి గ్రమ్ము
నీ కన్నుఁదమ్ముల నీటుదొలఁగె;
హృదయభేదక చింత లేనియు నడఁగించు
చిఱునవ్వు విడిమోము చిన్నవోయె;
కనుల కానందంబు గలిగించు నీరూప
సౌందర్య మేడకో జాఱిపోయె;
ఎపుడైన విశ్లేష మెఱుఁగని చిత్తంబు
ప్రణయ శ్మశానమై రాజఁదొడఁగె;