పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii

ఎట్లును బదునేడవ శతాబ్ది కీవలిదియే యనకతీఱని యీకావ్యము కవితాపరిణతినిబట్టి మాత్రము పదునాఱవశతాబ్దిలోఁ బుట్టఁదగినదిగఁ దోఁచును. ప్రతిభావ్యుత్పత్తులలో నాయకరాజులనాటి తెనుఁగుకవులెవ్వరును రఘునాథాచార్యునితో సరిరారు. ఇట్టి విశిష్టమైనవాఙ్ముద్రయే వారికి లేదు. ఈయుజ్జ్వలతయు పరిణతియు క్షయోన్ముఖమైన నాఁటి సారస్వతములో పుట్టకపుట్టిన వనవలెను. ఆ యుగలక్షణముల కపవాదభూత మై కంకంటి పాపరాజు కావ్య మొకటి యున్నదన్నచో నీ కులశేఖరచరిత్రమును దాని సరసను జేర్పవలెను. గతానుగతికమును మందప్రతిభము నగు పదునేడు పదునెనిమిదవ శతాబ్దుల తెనుఁగువాఙ్మయములో నరుదుగ నుదయించిన రెండుమూఁడు ప్రశస్తకృతులలో నిది యొకటి. అస లిది యిన్నా ళ్ళప్రకటితమై మఱుగుపడి యుండుటయే యాశ్చర్యము. ప్రభుత్వమువారిచే నేఁటివఱకుఁ బ్రచురితములగుచున్న పూర్వాంధ్రకావ్యములలో నింతకవితాగుణసమృద్ధమైన కావ్యము రాలే దనుట యతిశయోక్తి కాదు. ఇందలి ప్రతిపద్యమును శాణోత్తేజిత మైనరత్నము. ప్రబంధవాఙ్మయమహాసౌధమునకు మూలస్తంభములగు ఆముక్తమాల్యద, వసుచరిత్రము, పాండురంగమాహాత్మ్యము, ప్రభావతీప్రద్యుమ్నములలోని యాయా విశిష్టకవితాలక్షణములు రఘునాథాచార్యుని కృతిలో హత్తికొనినవి. భావగతముగనో రచనాగతముగనో, పలుకుబడినో, ప్రతిపద్యమునను నొకవిశేషము భాసించుచునేయుండును. కవియొక్క కృతహస్తతకు నిందలి ప్రతిపద్యము నుదాహరణమే.

ఇదియు నాళ్వారుకథ యగుట, కావ్యముఖమునందలి పంచాయుధవిష్వక్సేనగరుత్మదాదులస్తుతులును, కావ్యమున నాపాదచూడముగ గుబాళించుచున్న విశిష్టాద్వైతసంప్రదాయముద్రయును ఆముక్తమాల్యదను దలపించుచున్నవి. శ్లేషవర్ణనాసందర్భములలో నీకావ్యము వసుచరిత్రధోరణులను పుణికి పుచ్చికొన్నట్లు కననగును. ఒక్కొకయెడ తెనాలికని కూర్పుబిగువులహరువు మెఱయును. ఇఁక సంవాదములలో, శృంగారదౌత్యములలో, ప్రణయలేఖలో సూరన దైశికముద్ర యుట్టిపడును. కవియుపజ్ఞకుఁ దొలియాశ్వాసమున హరిణీవృత్తాంతములోని కోడండ్రికముయొక్క చిత్రణమే గొప్పయుదాహరణము. నాల్గవయాశ్వాసముతుద నీళాపరిగ్రహానంతరము శ్రీరంగనాథుఁడు దాక్షిణ్యభంగభీరువై శ్రీదేవిని జూడనేగిన సన్నివేశము తన్నిర్వహణము కావ్యమునకు మకుటాయ