పుట:Kulashekhara-mahiipaala-charitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

మానముగనున్నవి. కులశేఖరులు నీళను శ్రీదేవికి నప్పగించు సందర్భములో దుహితృ స్నేహావిక్లబమగు పితృహృదయమునుఁడి వెలువడినమాటలు, వానికి శ్రీదేవి యొసఁగినయుత్తరమును ఔచిత్యమునకు మేఱుగ నున్నవి.

కౌస్తుభాంశజనితుఁడగు కులశేఖరుని భక్తివాసనాక్రమసమున్మేషము, రామాయణశ్రవణసమయములయందలి యతనితన్మయత, భాగవతులయం దతని పక్షము పుణ్యవాసనాప్రబోధదక్షములుగ నున్నది. మంత్రులదుర్మంత్రమును వ్యవహారకౌటిల్యమునుఁ జిత్రించిన నేర్పు కవికిఁ గల లోకస్వభావపరిజ్ఞానమునకు నిదర్శకముగ నున్నది. రసానుకూలముగ నాయఘట్టములలో స్వీకృతము లైనఛందోభేదములు శిల్పజ్ఞతను జాటుచున్నవి.

కావ్యము సర్వాంగీణముగ గుణసంపన్నమైనపుడు కతిపయోదాహరణములతో దాని సమగ్రసౌందర్యనిరూపణము సాధ్యపడునది కాదు. సమగ్రపరిశీలనమున కెడమును లేదు. ప్రచురితములై వెలువడుచున్న గ్రంథమాత్రములనెల్ల "వ్రతానా ముత్తమం వ్రతం" అను న్యాయమును పాలించి యతివిస్తరముగఁ బీఠికలయందుఁ బ్రశంసించుట యొకయాచార మైపోయినది కానఁ బ్రకృతకావ్యమును గూర్చి సంక్షేపముగ నైన నీమాత్రము చెప్పవలసి వచ్చినది. కాని నిజమన కిట్టికావ్యములు పీఠిగోపజీవ్యములు కావు. స్వయంప్రకాశములు.

నికషాయమాణులై యభిజ్ఞు లీకృతిరత్నము నొరయుదురు గాక.

తి. చంద్రశేఖరన్.