పుట:Krxshhiivaludu (1924).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నదానము మా వారివలె చేయువా రితరులున్నారో లేదో. ఎట్లును మించినవారు లేరనుట అతిశయోక్తిగాదు. ఈవిషయమున రామిరెడ్డిగారు ఈ క్రింది విధమున రమ్యముగ నుడివి యున్నారు.

ఉండి తిన్నను లేక పస్తున్నగాని
యాసచేయవు పరుల కష్టార్జితంబు;
నాకలెత్తగ నీపంచ కరుగు నతిథి
తినక త్రావక పోయిన దినములేదు.

కాపుటిల్లాండ్రను గూర్చి కవి చేసిన స్తుతులన్నియు సత్యమునకు మీఱినవి కావు; తక్కువ. వారియొక్క "శాంతి నీతియు నురుకష్టసహనశక్తి, నెవరెఱుంగుదురు?" స్త్రీలంగూర్చి వీరొనరించిన ప్రశంస యెంతయు సత్యము; గంభీరమును.

అతుల సంసారసాగర మందు గాల
జలము సుకృత దుష్కృతవాత చలితమగుచు
సుఖవిషాదపు దరగలై సుడియుచుండ
పడవవై గట్టుజేర్తువు పతిని, గృహిణి!

సంగ్రహించి వ్రాయుశక్తియందు ఈ కవిని మించినవారుండరు కాబోలు, ఈ గ్రంథమును జదువ జదువ ఏరీతిని నిన్నియంశములను నిన్నికొద్దిపుటలలో నిక్షేపించినాడు అను ఆశ్చర్యము దాల్పని వారుండరు. పునరుక్తి, నిరర్థకవృత్తి, యిత్యాది కాలవ్యయమును స్థలవ్యయమును చేకూర్చు పద్ధతులు లేవు. తన కుల