పుట:Krxshhiivaludu (1924).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పునర్జీవితముంజేసి దివ్యాకృతిగ మనముందర రామిరెడ్డిగారు నిలిపియుండుట వారి యసాధారణప్రజ్ఞను సూచించుచున్నది.

కృషీవలుని జీవితమంతయు పువ్వులపాన్పు గాదని కవిగా రెఱుంగక పోలేదు. పట్నవాసులకు వారికినుండు ఆర్థికస్పర్థ, సర్కారువారు వారియెడల చేయు అనాదరణము, ముఖ్యముగా వారి నావరించియుండెడు అజ్ఞానాంధకారమును, దానిచే వారినిపట్టి బాధించెడు దురాచార పిశాచముల విషయమును రాజకీయ సాంఘికాదినీతులును, సంస్కారముల యావశ్యకతను సూక్ష్మముగ దడవియున్నారు. మింటికెగయు పక్షియైనను భూమిమీద పెట్టియుండెడి గూటిపై చూపువేయక యుండునా? కాపువారియొక్క దుఃస్థితి యెప్పుడు తొలగును? వా రికముందైన పూర్వపు రెడ్డిరాజుల కాల మందువలె ఉన్నతపదవికిరారా? అను విచారములు అసలు సహజములేగద. "కాలగర్భంబు నందెట్టి ఘటనగలదొ; భావిపరిణామ మెవ్వరు పలుకగలరు" ఎవ్వరు పలుకగలరో గాని నావలన మాత్రముగాదు. రైతు లెట్టి దారిద్ర్యముపాలైయున్నారు! "కార్యారంభంబును ధైర్యమున్‌ విడకుమయ్యా" అని కవిగారు సంబోధించుచున్నారు. వీరి మాటల నాలకించి యాదరింతురు గాక. ముఖ్యముగ మా కులమువారికి అతిథి సత్కారము ఒకరు చెప్పక చూపక వచ్చిన సదాచారము.