పుట:Krxshhiivaludu (1924).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవ్యపాశ్చాత్య సభ్యత నాగరకత
పల్లెలందు నస్పష్టరూపముల దాల్చి
కాలసమ్మానితములైన గ్రామపద్ధ
తులను విముఖత్వముం గొంత గలుగజేసె.

నేటి నాగరకత నీమేలుగోరక
యప్పుచేసి బ్రతుకుమని విధించు
నాయవృద్ధికన్న నావశ్యకపదార్థ
సంఖ్య హెచ్చ జిత్తశాంతి యున్నె?

కవికి పరిణామములు వలయునో వలదో తెలియకున్నది. కవితా భావములను శాస్త్ర తత్త్వములం బలె తార్కిక దృష్టితో విమర్శింపదగదు. వానియందు రసికులు గమనింపవలసిన విషయము సౌందర్యము. ఆ గుణ మీకావ్యమందు అఖండముగ నున్నది.

అసంబంధములగు వర్ణనలు సంగతు లీ గ్రంథమున లేవు. ప్రతియంశమును చిత్తరువున కనుకూలించినదియు అగత్యమైనదియుగానున్నది. సంయోగతాలక్షణ మిందు ఏమాత్రము భంగము చెందకుండుట కవియొక్క భావనాగాంభీర్యమునకు అమోఘమైన సాక్ష్యము. తా వర్ణించు జీవితమును విషయములును తనకు అనుభవ వేద్యములు కాబట్టియు, వానియందు తనకు మనసు హృదయసంపూర్ణముగ లీనమై యుండుటచేతను వర్ణనలన్నియు హృద్యతాగుణపరిశోభితములు.