పుట:Krxshhiivaludu (1924).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావకళా నిర్మితములును శోభితములును అయిన ప్రకృతి ప్రతిబింబములట్లు సత్యమును రామణీయకమును దాల్చియున్నవి. కృతిపరిమాణమున చిన్నదైయును గుణమున నానాసౌభాగ్య శోభితముగనున్నది. వీని నన్నింటిని విడదీసి ప్రదర్శింపవలయునన్న సూత్రమునకన్నను వ్యాఖ్యానము విపులమగును. అట్లు చూపుటచే చదువరుల భావపరిశ్రమ విక్షేపములకు నిరోధముగల్గును. కాన, కొన్ని యంశములను పేర్కొని విరమించెదను.

ఇందు గ్రామాంతర నివాసము వ్యవసాయవృత్తి ఇత్యాది ప్రకృతి సామీప్యజీవితమునకును మనుష్య స్వభావ ప్రవృత్తికిని ఉండు సంబంధము చూపబడియున్నది. మొత్తముమీద పట్నవాసు లంత మంచివారుగారనియు, గ్రామవాసులు నడవడియందు మేలుతరమైన వారనియు కవి యొక్క అభిప్రాయము. ఇది నిర్వివాదము కాదని నామనవి. పట్టణస్థులకు గ్రామస్థులకు చర్యాబేధములు, స్వభావభేదములు లేవనలేముగాని, పోలికలనుపెంచి యెక్కువతక్కువలను రూపించుట సాహసకార్యము. దేశాభ్యుదయమునకు పల్లెలెటులనో పురములును నట్లే యావశ్యకములు. మఱియు ఆర్థిక ప్రపంచమునకు ఆధారము వ్యవసాయమని కవిగారు చూపియున్నారు. ఇదినిజమేగాని తక్కినవాణిజ్యాది యభ్యుదయములు లేనిచో దేశము సమగ్రత తాల్వనేరదు.