పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324


వేదము వేంకటరాయ శాస్త్రి గారు

శ్రీ రాజా మంత్రిప్రెగడ భుజంగరావు బహద్దర్ జమీందారుగారి ప్రథమ పుత్రికయగు హైమవతీ పరిణయపు నాకబలి (22-12-1913) నాఁడు బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారి యధ్యక్షతను ఏలూరులో కొప్పరపు సోదరకవుల యాశుకవిత్వ సభ జరిగినది. ఆ సభోదంతమును 1914 జనవరి 3 కృష్ణా పత్రికలోఁ బ్రకటించిరి. అందలి వేదము వేంకటరాయశాస్త్రిగారి యభిప్రాయము.

"వీరు చేసిన పని మిక్కిలి కష్టమైనది. కవిత్వములో కష్టము నెఱింగిన వారికే యీ సంగతి తెలియఁగలదు. ఇందు ఆశుధారావ్రతము కత్తిమీదను, త్రాటిమీదను నడచుట వంటిది. ఆక్షేపించుట సులభము. చేయుట కష్టము. అన్ని పద్యములు మిక్కిలి బాగుగా నున్నవి. లోపములే కనుపించలేదు. ఉభయ భాషల యందును వీరికిఁగల సమర్ధతను వెల్లడించుచున్నది. ఇది అభ్యాసవశమున కలిగిన శక్తి కాఁజాలదు. వీరి ముఖమున బాల్య మగపడుచున్నది. జన్మతోవచ్చిన శక్తి యనుటకు సందియములేదు. వీరిని నిందించుటకు యత్నించువారు మిగుల నిర్దయులు, మఱచి పోఁదగినవారు. వీరికి నేఁడొసఁగఁబడిన “ఆశుకవి శిఖామణి” యను బిరుదము, తత్సూచకముగా నీయఁబడిన బంగారు పతకము వీరికి మిక్కిలి యర్హమైనవని నేను రూఢిగాఁ జెప్పఁగలను. కాదని వాదింప దలఁచిన వారితో నేను వృద్ధుఁడనయ్యును బోరాడుటకు సిద్ధుఁడనై యున్నాను. కాదనువారు నాయెదుట వాదింప వచ్చును. ఇదియే నా వాదమునకు తగిన సమయము. ఈ ధీరులు నయాది గుణములు కలిగిన వారగుటచేత జనుల ప్రేమ కర్హులు. వీరింకను వృద్ధిలోనికి రాఁగలరని నా భావన."