పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
323

40. మరణము మేలుగాదె యవమానముకన్నను, నాల్గుడబ్బులుం
     దొరుక నినుం భరింతుననితోపఁగ నీపని బూనినాడ నీ
     భరణముకోసమై పడెడిపాటులు నాకవి ప్రాణగొడ్డపుం
     జెఱలయి యేచుచున్నవి యిసీ! యని పొట్టకు బుద్ధిసెప్పెడున్

41. పరునిబలంబు నాబలము బాగుగఁ జూడక కాలుదువ్వఁగా
     బరపెదు, పిచ్చిసాహసము ప్రాణములార్చు, నతండు సత్కవీ
     శ్వరుఁడు, మహానుభావుఁడు, యశస్వి, సుధీమణి, నక్కయేడ? యా
     పరమపదంబదేడ? యని పల్కుచు గుండెకు బుద్ధిసెప్పెడున్

42. చరమదశన్ విషాదగతి సంభవమయ్యె, వధానకార్యమున్
     నెఱపుటతప్ప, చూపవలె నీదగు ధారణయంచు సభ్యులం
     దఱు బలవంత పెట్టిరెటుఁ దప్పుకొనంగలవాఁడ నింక పై
     జరుపఁగఁబోకుమంచుఁ బదిసారులు నోటికి బుద్ధిసెప్పెడున్

43. చుఱుకగు తెల్వితేటలవి సున్నయెయైన సదాత్మతం గడుం
     బరువుగఁబల్కి పెద్దలిడు మన్ననలం గనబోక మంచి సె
     బ్బరంగనలేని యర్భకులపాలయితింగద! చెడ్డబుద్ధినిన్
     సరసకునీడ్చి కూల్చెనని చాటునబుద్ధికి బుద్ధిసెప్పెడున్

44. కరముస్వపాండితీమహిమఁ గన్పడఁజేసి పొగడ్తఁ చెందఁగా
     సరియనిపించుఁగాని తనసాహితిగట్టిగఁ జూడనెట్టిదో
     యెఱుఁగక పండితప్రవరు లెంతటివారయియున్న నాసుధీ
     వరులకు నేమిరాదనుచు వాగుచు నింకఁదనంత పండితుల్
     మఱియిక నెవ్వరుండరని మాటికి మాటికిఁ జాటుచుండుటల్
     ధరణినిఁ బండితబ్రువుల లక్షణమంచు వచింత్రుకోవిదుల్.