పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
325


శ్రీరాజా మంత్రి ప్రెగడ భుజంగరావు బహద్దరువారి

హితోపదేశ పద్యములు

మనోరంజని 15 నవంబరు 1911

సంపుటము : 2

సంచిక: 1

తొలుతన్ వాగనుశాసనుండు నిలిపెం దోడ్తోడ రాజేంద్రుఁడీ
తెలుఁగున్ వర్థిలఁజేసె, దిక్కన మహోద్వృత్తిం బరంగించె, న
వ్వల నెఱ్ఱాప్రగడాఖ్య సత్కవియు నొప్పన్ సోముడుం బెంచి రీ
యిలపై దానికిఁ గృష్ణరాయఁడును జేయించెం జయంతింగడున్

కావ్యరచనాగరిమఁ జూపె నవ్యరీతి
నాంధ్రకవితా పితామహుం డతనివెనుక
ఘనుఁడు పింగళి సూరన కావ్యకాంత
వివిధరీతుల మెప్పంది వెలయఁజేసె

నాకుజ ముఖ్యులౌ కవు లనంతములౌ కృతులన్ రచించి సు
శ్లోకుల సచ్చరిత్రములు సొంపుగ నిల్పిరి, వారువోయినన్
లోకములం దదక్షరములుం గృతికర్తల పేళ్లు నిల్చెఁగా
కేకరణిం గణింపనగు హృద్యములై తగు తచ్చరిత్రముల్

కవులనంగ సృష్టికర్తలు కాలత్ర
యజ్ఞు లిట్టులయ్యు నాంధ్ర భాష
పొలుపు దక్కి, మారి పోవుచు నుండంగ
నేమి చేయుచుండి రెట్టి తగవు?