పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుస్తీపట్టునది. తదితరులకా కష్టముగాని యా యానందముగాని యుండదు. అవధానియగు వాఁడాశుకవియైననే వీరని వారని లేక యెల్లర నానందపెట్టఁ గలఁడు. అట్టివారెప్పుడో యెక్కడనో కాని పుట్టరు. ఆంధ్రులయదృష్టవశమున నట్టివారు కొప్పరపుసోదర కవులవతరించిరి.

వీరి నివాసస్థలము గుంటూరుజిల్లా నర్సరావుపేట తాలూకా కొప్పరము గ్రామము. తండ్రి కొప్పరపు వేంకట రాయఁడుగారు. తల్లి సుబ్బమాంబగారు. ఆఱువేల నియోగి బ్రాహ్మణులు. ఆపస్తంబసూత్రులు. కౌండిన్య సగోత్రులు. వేంకటరాయఁడు గారికి ప్రధమపుత్రుఁడు వేంకటసుబ్బరాయ కవి. వీరి జననము 12-11-1885నకు సరియగు పార్ధివ సంవత్సర కార్తీక శుద్ధ గురువారము. రెండవపుత్రుఁడు వేంకటరమణ కవి. వీరి జననము 30-12-1887 తారీఖునకు సరియగు సర్వజిత్సంవత్సర పుష్య బ౧ శుక్రవారము. మూఁడవ పుత్రుఁడు బుచ్చి రామకవి. జననము 9-12-1892. నాల్గవపుత్రుఁడు లక్ష్మీనారాయణ. వేంకట రాయఁడుగారికి పుల్లమాంబ, లక్ష్మీనరసమ్మయను నిర్వురు పుత్రికలు గలరు. ఇందుఁ బ్రథమ ద్వితీయులగు వేంకట సుబ్బరాయ వేంకట రమణ కవులే సోదర కవులు. వీరి గురువులు బ్రహ్మశ్రీ పోతరాజు రామకవిగారు. బ్రహ్మశ్రీ రామడుగు రామకృష్ణ శాస్త్రిగారు, సోదరకవులష్టావధాన శతావధానాశుకవిత్వ సభలు కొన్ని వందలు చేసిరన్న నతిశయోక్తి కాదు.

సోదరకవుల మేనమామలున్నది నేనున్న యేల్చూరు గ్రామమగుటచే నచ్చటికి వీరప్పుడప్పుడు వచ్చుచుందురు. వీరెక్కడఁ గూర్చున్న నక్కడ జనులు గుంపులు గుంపులు కూడుచుందురు. 1912లో నా పదునాల్గువయేట నేల్చూరులో శ్రీ వేంకటసుబ్బరాయ కవిగారి ప్రథమ దర్శనభాగ్య మొదవినది. నేను గన్పించుట తోడనే చిఱునవ్వుతో "కుశలంబే మిన్నికంటి గురునాథ కవీ" అని పద్యముతో నడిగిరి. నేను నవ్వుచునూరకుండఁగా నీసారినేను వచ్చునప్పటికి నీవు పద్యములతో నుత్తరమీయవలయుననిరి. నేనట్లే వారు వచ్చినపుడింటనే రెండు పద్యముల

XXViii