పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణించుకొనిపోయి వారడిగినపిదపఁ గుశలముగా నుంటినని యొక కందము, తమ రెప్పుడు దయచేసితిరని యొక కందము చెప్పఁగా వారు బ్రహ్మానందభరితులైరి. ఆవలవారూరికేగుచునబ్బాయినాయఁడు వ్యాకరణమంపెదను దానింజదువు కొనుమనిరి.

వేంకట సుబ్బరాయకవి మిక్కిలి చక్కనివాఁడు. జాళువా పసిఁడి చాయ మేను. పాలుగాఱు మొగము, చెంపకు చేరెఁడేసి కన్నులు. కంఠధ్వని కంచుమ్రోఁగినట్లుండును. వర్ణోచ్చారణము విస్పష్టముగా నుండును. ప్రాస్తావికశ్లోకములు పద్యములు నెన్నివేలు వచ్చునో చెప్పలేము. మెలితిరిగిన మీసములు మిలమిలలాడ, చిఱునవ్వుకాంతులు చిందులాడ, నిద్దంపు చూపులు నిగనిగలాడ, హస్తకంకణ మందలి యన్నువగంట యల్లలనాడ స్నిగ్ధ గంభీర నిర్ఘోషముతో నొనర్చుచున్న ప్రసంగము విను శ్రోతలు కాలమెంతచన్నది తెలియక యట్టె మ్రాన్పడి వినుచుందురు. వినువారికి విసువుపుట్టకుండ గంటల కొలఁది ప్రసంగ మొనర్చు చుంటయు నొకకళయే. అందఱు నేదియో రిత్తకల్పించుకొని మాటాడనేరరు. వీరు తొమ్మిది పదియేండ్ల యీడుననే తండ్రితనను షాహుకార్లకడకు వెంటఁ బెట్టుకొనిపోవ నప్పుడు తాను చదువుకొనుచున్న రఘువంశమందలి 'యథాకాల ప్రబోధినామ్' మున్నగు రాఘవుల యాచార వ్యవహారముల నభివర్ణించు శ్లోకములం జదివి తదర్ధము వివరించి మనమునిట్లుండ వలెనని చెప్పఁగా వారందఱు ముచ్చటపడి మెచ్చుకొని తృణమోకణమో యిచ్చి పంపిడివారఁట. వీరట్లు గడించి కొన్న ధనముతో నుపనయనము జరిగినదట. పెండ్లియు వీరికిఁజిన్నతనముననే జరిగినది. కాఁపురమునకు రాకుండఁగనే భార్య గతించినది. పిమ్మట రెండవ వివాహము జరిగినది. ఆమె చాలకాలమునకుఁగాని కాఁపురమునకు రాలేదు.

వీరు యౌవనదశయందు బ్రహ్మచర్యవ్రతమును దీక్షగా సాగించిరి. “వాని చక్కఁదనము వైరాగ్యమునఁజేసి, కాంక్షసేయు జారకామినులకు, భోగ బాహ్యమయ్యె”నని స్మరించి మేమందఱము వీరిని రెండవ ప్రవరుఁడనుకొనెడి

XXiX