పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవి పరిచయము

సోదరులారా!

కవిత్వ మొకకళ, దానినాశువు మధురము చిత్రము విస్తారమునని కొందఱు, నాశువు గర్భము బంధము చిత్రమునని కొందఱు నాలుగు తెఱఁగు లొనర్చిరి. ఉభయమతములందాశువున్నది. ఆ యాశుకవితా సరస్వతి వేములవాడ భీమకవి నాడించినది. ఆవల శ్రీనాథుని చెట్టఁబట్టినది. పిదప నల్లసాని పెద్దనంజేరి కాలికిగజ్జెగట్టి కదనుద్రొక్కినది. రామరాజభూషణుని రచ్చకెక్కించినది. గణపవరపు వేంకటకవిని గణనకుఁ దెచ్చినది. కంకంటి పాపరాజును మిన్నంటనెత్తినది. తక్కిన వారెవ్వరుఁ దమగ్రంథములలో నాశుకవులమని చెప్పుకొనలేదు. అటుమీఁద మోచర్ల వెంకన్న, పిండిప్రోలు లక్ష్మణకవి, శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి, తురగా వెంకమురాజు మున్నగు వారితో ముచ్చటలాడి పిమ్మట నీయాశు నిరువదవశతాబ్ది ప్రవేశించుచో నొక వెలుఁగు వెలిఁగినది. పట్టణము పట్టణము పల్లె పల్లె తిరిగి పట్టపగ్గములులేక మహోద్దండ తాండవము సలిపి మహాజనమునుఱ్ఱూఁతలూపినది. మహా పండితులైన నంతపనిచేయలేదు. అదియొక కవులకే తగిపోయినది. కవులైన నొక్కచో నున్నచో నంతపని చేయలేరు. దేశాటనముచేయు నవధాన కవులే చేయఁ గలరు. అవధాన కవులైనఁ గేవలవధానములు సలుపుచు జనసామాన్యము నంతయు నానందపెట్టలేరు. అవధానములలో నవధానియుఁ బృచ్ఛకుఁడునే

xxvii