పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోదరకవులను బ్రశంసించు పండితకవుల పద్యభాగమునకు, 'కొప్పరపు కవుల యశోడిండిమ'మనుపేరు పెట్టితిని. ఆ పద్యములనెల్ల నెంతో శ్రద్ధతో సంపాదించి యేఁబది సంవత్సరములకుఁబూర్వమచ్చొత్తించిన, శ్రీ చిరుమామిళ్ళ లక్ష్మీనారాయణ ప్రసాదు, బి.ఏ., గారికిని, కాకినాడ సభా వృత్తాంతముల సేకరించి ప్రకటించిన శ్రీ చేగంటి బాపిరాజుగారికిని, మున్ముందు నా కృతజ్ఞతఁ దెలుపుచున్నాను.

కవులయెడ వారికిఁగల యపారాభిమానముచేతను, నాయందలి వాత్సల్యముచేతను, వార్ధకానారోగ్య నేత్రావరోధముల సరకుసేయక, ముద్రణ స్ఖాలిత్యముల నప్పటికప్పుడు సవరించి యిచ్చుచు, నా భారమును తగ్గించిన ఉభయ భాషా ప్రవీణ, వేదాంతపారీణ, కవిశేఖర, విద్యానాథ, కవితామహేశ్వర బిరుదాం చితులు శ్రీ మద్గురు భాగవతాద్యనేక గ్రంథకర్తలునైన బ్రహ్మశ్రీ మిన్నికంటి గురునాథ శర్మగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు.

నేను గోరినప్రకారము విరాళము నొసంగుటయే గాక, నా కృషిలోఁ దామును బాలుగొని, శ్రీ సంకా వేంకటేశ్వర్లు గారిచే, చీరాలశతావధానమునకగు ధనము నిప్పించిన బ్రహ్మశ్రీ యల్లంరాజు సూర్యనారాయణ పంతులు, బి.ఏ., బి.యల్., అడ్వొకేటుగారికి నా కృతజ్ఞతాపూర్వక వందనశతంబులు.

గ్రంథమును నిర్దుష్టముగా సకాలమునకు ముద్రించియిచ్చిన 'హిందీప్రెస్ ప్రొప్రయిటరు' గారగు శ్రీపతి పండితారాధ్యుల మృత్యుంజయ శర్మ గారికి నా నమస్కారములు.

శక్రుఁ డాహ్వానమంపఁగా సమ్మతించి
స్వర్గమునకేగి యచ్చట సౌఖ్యమొందు
కొప్పరపు సోదరకవుల గొనబు కృతులు
శతవధానంబులివిగొని చదువరయ్య!

పెనుగుదురుపాడు           ఇట్లు,
శుభకృన్మకర సంక్రాంతి      బుధ విధేయుఁడు
14-1-1963    కుంటముక్కల వేంకట జానకీరామశర్మ