పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71


తిరుపతిరాయ మహాశయుండా సోదర కవులలో నగ్రజుచేతను, బాపట్లలోఁ దత్పుర వాసులనుజుని చేతను శతావధానములు చేయించి మిక్కిలి సంతసించి నూట పదారులు బహుమానములొసంగి వారినత్యంతము గారవించిరి. పిమ్మట ఆ 1911 సం.రం. అక్టోబరునెల ది 1,2 తేదీలను గుంటూరులోఁ గొందరు ప్రముఖులు సభఁగూర్చి సోదర కవులలో అగ్రజులగు బ్రహ్మశ్రీ వేంకట సుబ్బరాయకవివర్యులచే శతావధానమును జరిపించిరి. తొలిదినమున బెజవాడ డి.ము. కోర్టు ప్లీడరుగారగు బ్రహ్మశ్రీ పాటిబండ వేంకటరమణయ్య పంతులుగారును, మఱుదినమున మా పట్టణమందలి మిషన్ కాలేజి నుపాధ్యాయులగు శ్రీమాన్ వంగిపురపు కృష్ణమాచార్యులు బి.ఏ., యల్.టి. గారును సభాధ్యక్షులుగా నుండిరి. మొదటి దినము నలుబదియొక్కరగు పృచ్ఛకులకును, రెండవ దినము మఱిపదుగురిని గలిపి యేబదియొక్కరికిని నవధానము జరుపబడెను. రెండు దినముల సభలకును మా పట్టణములోఁగల ప్రముఖులనేకులు విచ్చేసిరి. అవధానిగారి కవితాధోరణియు, సమస్యాపూరణనైపుణియు, ధారణాశక్తియు నసాధారణములై యొప్పెను. అవధాన మంతమయిన పిదప సభ్యులలో కొందరు పద్యములు రచియించి కవుల నైపుణ్యమును శ్లాఘించిరి. సభాంతమున నీ శతావధాన కవులకు నూటపదారులు బహుమాన మీయఁబడెను. జయజయధ్వనులతో సభముగిసెను. ఆ యవధాన పద్యములునుఁ బ్రశంసాపద్యములును నిందుఁ బొందుపఱపఁబడినవి.

గుంటూరు,

అక్టోబరు, 1911

ఇట్లు,

బుధజనవిధేయుఁడు

కాకాని పుండరీకాక్షుడు