శము లేకపోయినది. అప్పుడు లింగమగుంటనుంచి మరియొకరిని తోడుతీసికొని కొత్తపట్టణముదగ్గర చెన్నపట్టణముకాలువమీద పడవనెక్కి వారమురోజులలోపలనే చెన్నపట్టణము చేరితిని. నాభార్య కప్పుడు పండ్రెండవయేడు. చామనచాయరూపము. మిక్కిలి పలచగానుండెను. తెలుగు కొద్దిగా చదువను వ్రాయను మాత్రమే నేర్చియుండెను. నేను బి. ఏ. సీనియరులో చదువుచుండగానే వేసవి సెలవులలో నాకు కార్యముజరిపిరి. పిమ్మట చెన్నపట్టణముచేరి యధాప్రకారము చదువుసాగించుచుంటిని.
పట్నవాసము
మేము చెన్నపట్నములో విద్యార్థివసతిగృహము ప్రారంభించినపిమ్మట కొన్నాళ్ళకు ఆగృహములోని విద్యార్థులము కొందరము కలసి డిబేటింగుసొసైటిని స్థాపించి, అందు ప్రతి ఆదివారమును ఏదో ఒకవిషయమును చర్చించుచుంటిమి. ఆచర్చలు ఆంగ్లేయభాషలోనే జరుపుచుంటిమి. ఒకప్పుడు ఇంగ్లీషులో వ్యాసములువ్రాసి చదువుటయు జరుగుచుండెను. ఆచర్చలలోను, ఉపన్యాసములలోను నాకు ఒకకొంచెము ప్రవీణత యున్నట్లు కొందరు విద్యార్థులు చెప్పుకొనుచుండిరి. ఇట్లు జరుగుచుండ నొకనాడు షేక్స్పియర్ వ్రాసిన "జూలియస్ సీజరు" నాటకములో నొకటి రెండు ప్రధానాంకములు ప్రదర్శింపవలెనని నిర్ణయించి బ్రూటసుపాత్ర హనుమంతురావుకు, కాసియస్ పాత్ర నాకు నిచ్చిరి. ఆప్రదర్శనమున కాసియస్‌పాత్ర అందరికంటె బాగుగ నున్నదని చెప్పుకొనిరి. నన్ను సుశిక్షితుడగు