పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని ఋణములు కొన్ని యింకను బాధించుచుండెను. మీదు మిక్కిలి సీతారామయ్యగారి తల్లిదండ్రులును, అక్కచెల్లెండ్రును యీఆదాయమువలననే జీవించుచుండిరి. కాబట్టి భూములవల్ల వచ్చు ఆదాయముతో ఋణముతీర్చుమార్గము కనబడకుండెను. కుటుంబ మింకను కొంత అట్టహాసముతో కనబడినను నిజముగ నానాట క్షీణదశకు వచ్చుచుండెను. ఈసమయముననే పిల్లకు వివాహమును పిల్లవానికి ఉపనయనమును జరిపిరి. మొట్టమొదట తిరుపతివెళ్లవలెనని అనుకొనిరిగాని ఏదియో యిబ్బందివలన ఆప్రయత్నము మాని, వివాహమునకు ముందురోజు కొండకు నడచినట్లు మంగళవాద్యములతో మమ్ము నిర్వురను ఊరివెలుపల ఇంచుక దూరముననున్న మఱ్ఱిచెట్లవరకు నడిపించుకొనివెళ్లి యింటికివచ్చి, వెంకటేశ్వరపూజచేసి మరియొకప్పుడు కొండకు వచ్చెదమని మ్రొక్కుకొని సమారాధన గావించిరి. మరుసటినాడు పిల్లవాని ఉపనయనముచేసి ఆమరునాడు వివాహము జరిపిరి. పెండ్లికార్యము సాధారణముగనే జరిగిపోయెను. పెండ్లిలో నాకు అయిదుయకరముల మెరకయీనాముభూమిని, రు 100/- ల రొక్కమును, ఒక ఆవుపెయ్యను కన్యాదానసమయమునందు ఇచ్చిరి. ఈదానము లేవియు మాతండ్రిగారు నిర్బంధించినందున ఇచ్చినవిగావు. వారు మనసోత్సాహముతో కుటుంబమర్యాద ననుసరించి యిచ్చినవే. ఈపెండ్లికి మాతండ్రిగారు మూడువందలు మాత్రమే వ్యయపఱచినారు. నావివాహము సర్వజిన్నామసంవత్సర శ్రావణశుద్ధమునందు జరిగినది. వివాహానంతరము కొన్ని రోజులకు లింగముగుంటనుండియే చెన్నపట్టణము చేరి కళాశాలలో చదువనారంభించితిని. గృహప్రవేశము జరుపుటకు అవకా