నటకుడని శ్లాఘించిరి. నా చిన్ననాటి నాటకముల అనుభవము ఆనా డుపయోగించెననుట స్పష్టమే. పిమ్మటి కాలములో న్యాయవాదవృత్తియందు న్యాయమూర్తియెదుట నా కక్షిదారునిపక్షమున సభాకంపములేక వాదించుటలో సయితము ఈ అనుభవము కొంత యుపకరించెను.
బి. ఏ. సీనియర్‌లో చదువుచుండగా నొక శనివారము నాటి సాయంకాలము తంబుచెట్టి, లింగిచెట్టివీధులలో విద్యార్థులు గుంపులుగూడి గొప్పయుపద్రవము సంప్రాప్తమైనట్లు కేకలు వేయుచు తిరుగనారంభించిరి. కారణము విచారించగా మా కళాశాల విద్యార్థియగు ముట్నూరి సుబ్రహ్మణ్యము అనువానిని క్రైస్తవమతములో మరునాటి ఉదయముననే కలుపుకొనబోవుచున్నారు గావున దానిని ఆపివేయుటకే ఈసంరంభమని తెలిసినది. నేనును హనుమంతురావును ఆగుంపులతో కలుసుకొని ఒకయింట సభగాజేరి కొంత చర్చించుకొన్నపిమ్మట ఆచిన్నవాడు రాయపురమున ప్రొఫెసర్ రే అను మిషనరీయింట ఉన్నట్లు తెలిసినది. అప్పుడు మాలో కొందరిని ఆ మిషనరీతో మాట్లాడుటకు, మతప్రవేశము నాపుటకు, ఆపి, బందరులో అతని బంధువుల కిది తెలుపుటకు నియమించిరి. అందు హనుమంతురావును నేనుగూడ నియుక్తుల మైతిమి. మేము ఆరాత్రి రే దొర యింటికి బోయి ఆయనతో ముచ్చటించగా అతనిని మరునాడు మతములో కలుపుకొనవలెనను ఆలోచనయేమియు లేదనియు అతని బంధువులకు వర్తమానముచేసి పిలిపించవచ్చుననియు, వాగ్దానముచేసెను. ఆతనికి బ్రాహ్మణహోటలులో భోజనము పెట్టించు