పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నున్న రెండుగదులు ఉండెను. ఈభవనములో సుమారు ఏబది మంది విద్యార్థులు ఎఫ్. ఏ. మొదలు బి.ఏ. తరగతులవారు మాత్రమే నివసించుచుండిరి. భోజనములకు వంటశాల, వంట బ్రాహ్మణులు ఏర్పడియుండిరి. ఇందు బ్రాహ్మణవిద్యార్థులు మాత్రమే నివాసముచేయుచుండిరి. తక్కినకులమువారికి ఫెన్సు విద్యార్థిగృహము మరియొకటి కొంతకాలమున కేర్పరచబడెను. మేము దిగువగదులలో నలుగురువిద్యార్థులకు సరిపోవున ట్లేర్పరచబడిన పెద్దగదిలో నుంటిమి. నెల 1కి ఒక్కొక్కరము ఒక్క రూపాయిచొప్పున అద్దెయిచ్చుచుంటిమని జ్ఞాపకము. భోజనమునకు నెల 1కి 10 రూపాయలు నిర్ణయమని జ్ఞాపకము. విద్యార్థి వలన వసూలుచేయబడిన మొత్తము అంతయు వసతిగృహమునకు వలయు ఖర్చులక్రిందనే వినియోగింపబడుచుండెను. ఈ వసతిగృహవచారణకర్తగా అయ్యాదొరఅయ్యంగారనువారు, కాలేజితో సంబంధించిన హైస్కూలులోని ఉపాధ్యాయులుగానున్నవారు నియమింపబడి పనిచేయుచుండిరి.

ఈ వసతిగృహములోనే చిత్తూరువా రిరువురు బి. ఏ. తరగతివిద్యార్థులు నివసించుచుండిరి. వారు తెలుగువా రగుటచేత మాకు వారితో చెలిమిచేకూరెను. వారిలో నొకరు విండ్లచెరువు రామయ్యగారు. వీరు చాల బక్కపలచగానుండెడివారు, కాని లెక్కలలో మంచిసమర్థులు. తక్కినవిషయములందును చురుకుగలవారే. రెండవవారు పిడతల సీతాపతయ్యగారు. ఈయన తెలివిగలవారు. తెలుగులయందు మంచి ప్రవేశముగలవారు. వీరిసహపాఠి నాగపూడి కుప్పుస్వామయ్య