పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గారు వసతిగృహములో నుండక తండియారుపేటలో భార్యతో కాపురముచేయుచు కాలేజికివచ్చి చదువుచుండెడివారు. వారు అన్నివిషయములందును సమానమగు సామర్థ్యముగలవారు. వారు అరవవారయ్యును తెలుగుభాషయందు ఎక్కువ అభిమానము గలిగి అందు పాండిత్యము సంపాదించిరి. సీతాపతయ్యగారును కుప్పుస్వామయ్యగారునుగూడ తెలుగులో పద్యములు వ్రాయుచుండెడివారు. వీరుమువ్వురకు (chittoor trinity) చిత్తూరిత్రయమని మేము పేరుపెట్టితిమి. దినములు గడచినకొలది వారికిని మాకును ఎక్కువ స్నేహభావ మేర్పడెను. మాయందు వా రెక్కువ ప్రేమతో మెలంగుచుండిరి. మేము బి. ఏ. క్లాసులో చదువుకాలమునకు తిరునారాయణస్వామి ఎఫ్. ఏ. సీనియరులో చదువుచుండెను. ఈతనిభార్య గర్భిణియై యుండినందున ఆమెను పుట్టినింటికి పంపి మరియొకచోట భోజనముచేయుచుండెను. ఆకాలములోనే నాకు గుంటూరులో విద్యాగురువుగనుండిన శ్రీకొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చెన్నపట్టణములో పచ్చయప్పకళాశాలలో తెలుగుపండితులుగా నియమింపబడుటచేత వారు తిరువళ్లిక్కేణిలో కాపురము చేయుచుండిరి. వారియింటిలో వారిబంధువు అమ్మాయమ్మగారు అను వృద్ధురా లుండెను. ఆమెయు తెలుగుకవిత్వమందు కొంతప్రవేశము కలిగినవా రగుటచేత మేము అప్పుడపుడు శాస్త్రిగారిని చూడబోయినపుడు ఆమెతోగూడ సంభాషించుచుంటిమి. తిరునారాయణస్వామి తెలుగుపద్యములు సుకరముగ వ్రాయుచుండెను. తాను వ్రాసినపద్యములను ఆమెకు చదివి వినుపించుచుండెను. ఇట్లుండగా అతనిభార్య ప్రసవించి కుమారునిగనె ననువార్త