పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తండ్రిగారు కావలసిన ఖర్చులన్నియు నియ్యజాలరని నేను డాక్టరు కుగ్లరును కోరియుండగా ఆమె నెలకు రు 7/- ల చొప్పున కొంతకాలము దయతో పంపుచుండెను. మరి కొంతకాలము చెన్నపట్టణములోనే యొక ఆంగ్లో - ఇండియనుకుటుంబములోని పిల్లకు ఉదయమున నొకగంట తెలుగుచెప్పుటకై నన్ను కోరి అందుక్రింద నాకు తానిచ్చుచుండిన రు 7/- లు జీతముగా చూచుకొనవలెనని ఆమె నిర్ణయించెను. ఆప్రకారమే ఆచిన్నదానికి తెలుగుచెప్పుచుంటిని. నా తండ్రిగారు నాకు కావలసినసొమ్ము పంపుచుండినందున నాకు వచ్చుచున్న రు 7/-లును చంద్రశేఖరమునకు ఇచ్చుచుంటిని. నాఅవసరనిమిత్తము అనిచెప్పి కుగ్లరుగారియొద్దనుంచి తెప్పించుకొనుచున్నసొమ్ము ఆమెకు తెలుపకుండ నే నితరుల కిచ్చివేయుట తప్పు అని తెలియకపోలేదు. నా కవసరములేదని ఆమెకు తెలిపినయెడల ఆమె దానిని పంపుటమానివేయుననియు, అప్పుడు నాస్నేహితునకు సహాయము చేయజాలననుమాటయే మనస్సున బెట్టుకొని ఆమెకు తెలుపకుండ గనే ఇట్లు వినియోగించుచుంటిని. కొంతకాలమునకు ఆమెకు ఎట్లో తెలిసి ఆమె సొమ్ముపంపుట మానివేసెను. కాని నేను దానిని మిక్కిలి కష్టమునకోర్చి చదువుచున్నవిద్యార్థియొక్క అవసరము నిమిత్తము వినియోగించితినని తెలుసుకొని కొంతవరకు నావిషయమై కలిగిన అభిప్రాయమును మార్చుకొనెను.

నేనును హనుమంతురావును మిల్లరుగారి విద్యార్థివసతి గృహములోనే నివసించుచుంటిమి. ఈ భవనము మూడంతస్తులు గలమేడ. దీనిలో టవరును, ఆటవరులో ఒకదానిపై నొకటిగా