పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లేదు. మాకును ఈచర్య మిక్కిలి సంతాపము కల్గించెను. పాలుగారు బడివిడిచిపోవురోజున బడిలోనిబాలుర నందరిని సమావేశపరచి తా నేపాపము నెరుగననియు, ఎవ్వరో దుర్మార్గులు చేసినపితూరీనిబట్టి అక్రమముగా తన్ను ఉద్యోగమునుంచి తొలగించుట కలిగినదనియు, ఇట్టి ఘోరకృత్యమునకు పూనిన వారికి తనకువలెనే అపకారముజరిగినప్పుడుగాని, తాను పడుచుండు పరితాపము తెలియదనియు, పరమదయాళుడగు దేవుడు వారిని క్షమించుగాక యనియు, ప్రార్థించుచు కన్నుల నీరుగార్చి, దు:ఖించెను. ఆయన చేసిన భాషణ యంతయు నన్నుగూర్చి చేసినట్లును, నేనే ఆ గొప్పయపకారియైనట్లును మిక్కిలి పరితపించితిని. హెడ్‌మాష్టరుగారు పక్షపాతము వహించి ఆబాలురకు ప్రశ్నలు ముందుగనే చెప్పియేయుందు రనువిషయము నిజమే అనుకొన్నను ఇంతకాఠిన్యము దొరగారు వహింతురని ఎప్పుడును తలచియుండలేదుగాన పాలుగారు అప్పుడు చెప్పిన వాక్యములు మనస్సున సూదులుగ్రుచ్చినట్లు బాధించినవి. నే నిట్టిపితూరి ఊలుదొరగారితో నెందుకు చేసితినాయని పశ్చాత్తాపము నొందితిని గాని, ఏదియో గొప్పతప్పు లేకుండిన ఊలుదొరగారివంటి నీతివర్తనుడు ఇట్టి శిక్షవిధించియుండరని మరల హృదయమున సంతుష్టిచెందితిని.

రివరెండుపాలుగారిస్థానే రెంటాల వెంకటసుబ్బారావు బి. ఏ. బి. యల్. గారిని నియమించిరి. వీరు చాల సమర్థులనియు నెలకు రు 150లో, రు 200 లో జీతముమీద వారీపనిని కంగీకరించిరనియు, ఒకటిరెండు సంవత్సరముల కాలమునకు మాత్రమే వా రీయుద్యోగము స్వీకరించిరనియు చెప్పుకొనిరి.