పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సలుపసమర్థులైన సంఘసంస్కరణాభిమానులు వీరు. వీరు వితంతూద్వాహముగావించుకొని సంఘబహిష్కరణబాధలనొందుచు కొన్నిగ్రంథములు తెలుగున వ్రాసి ప్రచురించియు, బంగాళాభాషాభ్యాసముచేసి, అందలి కధాగ్రంధములను ఆంధ్రీకరణముగావించి ప్రకటించియు, శారదయను మాసపత్రికను ప్రకటించియు ఈ రచనలవలన లభించిన స్వల్పాదాయముతో గాలిజీవనము చేయుచున్న యోగ్యపురుషులు, ఆకాలమున ఆంధ్రదేశమున సార్వజనిక జీవితమునందు గణనకెక్కిన ప్రసిద్ధవ్యక్తి. ఈయనకు పై జెప్పిన బందరుత్రయము చేయూత నొసగుచుండువారు.

ఇట్లు దేశపర్యటన గావించి, సొమ్ము సంపాదించి, బందరులో నొక విశాలస్థలము సంపాదించి, అందు కొన్ని భవనములను నిర్మాణముజేసి జాతీయకళాశాలను 1908 సంవత్సరమున స్థాపనగావించిరి. ఆకళాశాలా ప్రారంభోత్సవమున కాకినాడ న్యాయవాదులలో ప్రముఖులగు శ్రీ దురుచేటి శేషగిరిరావు పంతులుగారు అధ్యక్షతవహింప నాహూతులయ్యు రాజాలక పోయిరి. నేను అధ్యక్షత వహించి కళాశాలాప్రారంభము గావించుచు ఆంగ్లేయముననే యుపన్యసించితిని. కళాశాలాకార్యక్రమము నడిపించుట కొక కార్యనిర్వాహకసభ ఏర్పరుపబడినది. కళాశాలనిమిత్తము అయిదునూరులుగాని అంతకు మించిగాని విరాళములిచ్చినవారిలో కొందరితోపాటు నేనును అం దొక శాశ్వతసభ్యుడనుగా జేర్చబడితిని. స్వదేశోద్యమఫలితముగా ఆంధ్రదేశమున స్థాపితమైన బందరుకళాశాల కొంతకాలము ప్రజలచే మిక్కిలి శ్లాఘింపబడెను. కాని జాతీయవిద్యనుగూర్చి