పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వారై యుండిరి. వీరిలో పట్టాభిసీతారామయ్యగారు వైద్యమునందు నిపుణులని పేరుపొంది ద్రవ్యోపార్జనసామర్థ్యము గలిగినవారు. కోపల్లి హనుమంతరావుగారు యం. ఏ పరీక్షయం దుత్తీర్ణులై దేశములో విద్యావిషయికమైన సేవచేయవలయునను గొప్పదీక్షతో జీవితమును అర్పణజేయసమకట్టిన మహోదారమూర్తి. శ్రీ ముట్నూరికృష్ణారావుగారు ఆంగ్లేయములో ప్రావీణ్యము లేకపోయినను తెలుగునందు గొప్ప ప్రావీణ్యము గణించి ఆంధ్రవ్యాసరచనయందు సమర్ధులు. దేశోపకారకార్యములందు అగాధమగు అభిమానము గలవారు. వీరు మువ్వురును బాల్యస్నేహితులు. పట్టాభిసీతారామయ్యగారు వక్తృత్వశుద్ధి గలవారు. పైన నుడివిన వీరి సామర్ధ్యములు కాలముగడచిన కొలది ప్రస్ఫుటములై ఆకర్షణీయములైనవి. ఈస్వదేశోద్యమమునందు వీరు మువ్వురును అనన్యమైన విశ్వాసము గలిగి జాతీయవిద్యావ్యాప్తికై కళాశాలాస్థాపన చేయ దీక్షబూనిరి. గ్రామములవెంట సంచారముచేసి ప్రజలకు స్వదేశోద్యమము, జాతీయాదర్శములు, జాతీయవిద్యాప్రాముఖ్యములను గూర్చి బోధించి కళాశాలనిమిత్తము విరాళములను వసూలుచేయ నారంభించిరి. వీరితోపాటు శ్రీవల్లూరిసూర్యనారాయణగారును కొంతవరకు కవుతాశ్రీరామశాస్త్రియను మరియొక ఉత్సాహపురుషుడును దేశపర్యటనమందు పాల్గొనిరి. ఈ శ్రీరామశాస్త్రిగారి కాంగ్లేయవిద్యావాసన లేకున్నను తెలుగున చక్కగ వ్రాయునేర్పు గలదు. మహాసభలందు వేలకొలది జనుల హృదయములు రాతిబండలైనను కరుగునట్లు భావపూరితములును మృదులపదగుంభితములును ఉత్సాహజనకములు నగుభాషణలు