పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/198

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మిక్కిలి అభిమానోత్సాహములతో గంభీరోపన్యాసముల నిచ్చిన ఘనులెవ్వరుగాని వారిబిడ్డలను ఈకళాశాలకు పంపక ప్రభుత్వపాఠశాలలోనే విద్యగరపి ఉద్యోగములు లభింపజేసికొన జూచుచుండిరి. ప్రభుత్వపాఠశాలలో చేరుటకు ద్రవ్యము లేక, తిండికి గూడ జరుగని దరిద్రులుమాత్రము ఇందు విద్యార్థులుగ చేరుచుండిరి. వీరికి భోజనాదివసతులేర్పరచి, కొన్ని సంవత్సరములు శ్రీ హనుమంతురావుగారును, శ్రీ పట్టాభి సీతారామయ్యగారును చాల కృషిసల్పిరి. ఆకళాశాలలో దేశచరిత్రము, చిత్రకళావిషయములు, ఆంధ్రభాషాజ్ఞానముతోపాటుగ, చేతి పనులలోగూడ ప్రవేశముగల్గించుట కొక యంత్రాగారము స్థాపించిరి. రాట్నమువడికించుట, నేతనేయుట, తివాచీలునేయుట మొదలగు నిర్మాణకార్యములుగూడ నేర్పుచుండిరి. ఇట్లు ఉత్సాహముగ కొన్నిసంవత్సరములు నడచినవిగాని నానాట విద్యార్థులు తగినంతమంది లేక సన్నగిలిపోయినది. ఇంతటి దుస్థితి రాకపూర్వమే హనుమంతరావుగారు తా మంత నిష్కామ బుద్ధితో, త్యాగశీలముతో నిరంతరము నిద్రాహారములుమాని చేసిన సత్కార్యమునకు విద్యాధికులైనప్రముఖులలో సహితము ప్రోత్సాహములేకపోవుటచేత మన:క్లేశము పొందుచుండిరి. ఎడతెగని మహత్తరసేవయు, ప్రజలలో నిరుత్సాహమును ఆయన ఆరోగ్యమునకు భంగము కల్పించెను. తుద కాయన క్షయ వ్యాధిచే అకాలమృత్యువాత బడెను. అట్టి జ్ఞానమూర్తిని, నిష్కళంకసేవాతత్పరుని, సునిశిత ఆంగ్లభాషారచయితను, మహత్తరదేశభక్తుని, పావనచరిత్రుని గోల్పోయిన - ఆంధ్రదేశమే అననేల? - భారతదేశపు దౌర్భాగ్యమును వర్ణింపతరముగాదు. అప్పటి