పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కార్యములందు అభిమానము, సాంఘికరాజకీయములందు చొరవయు నెక్కువగ నుండెను. నీతిబద్ధమైన జీవితాదర్శములు వారిహృదయముల నాకర్షించుచుండెను. ఈ పరిస్థితికి వెంకటరత్నంనాయుడుగారి జీవితమును, నీతిబోధయు ముఖ్యకారణములై యుండెను. సంఘములో నొక వ్యక్తి యేనియు నీతివర్తనుడైనచో దాని ప్రభావ మూరక పోదనుట కిదియే తార్కాణము.

కాబట్టి నేను గుంటూరున నా వృత్తి కార్యము వ్యవహరింప వచ్చునాటికి నా యౌవనము కొంతగడచెను. జీవితాదర్శమునుగూర్చి కొంతనిశ్చయమేర్పడెను. పదిసంవత్సరములతో నా వృత్తికి స్వస్తిచెప్పి ఏదైన దేశహితకార్యమును చేపట్టవలయునను కృతనిశ్చయముతో వచ్చితినిగాని సంపాదనచేసి సౌఖ్యముపొందవలె నను ఆశయముతో రాలేదు. అట్లని సంపాద్య విషయమున వైరాగ్యమును కలుగలేదు. న్యాయముగ సంపాదన చేయవలయు నను కాంక్ష పూర్తిగనే యుండెను. కనుకనే గుంటూరుజిల్లాకోర్టులో పబ్లికుప్రాసిక్యూటరుపని సంపాదింపవలెనని ఆశించితిని. ఆ పనినిమిత్తము బందరుజిల్లాజడ్జిగారి సహాయము కోరతలంచి కోర్టులో వారి ప్రైవేటుగది కేగితిని. నాకును ఆజడ్జిగారికిని కొలదిరోజుల క్రితమే పైనచెప్పిన సంఘర్షణ జరిగియుండెను. గాన కొంత సంశయించుచునే లోపలి కేగి వారిసహాయ మర్థించితిని. సిఫారసు ఉత్తరము కావలెనా యని దయతోడను శాంతముతోడను నన్ను వారు ప్రశ్నించిరి. సిఫారసు అక్కరలేదుగాని యోగ్యతాపత్రము వ్రాసి యిండని కోరితిని. సిఫారసుకోరుట వంచనము, ఆత్మగౌరవభంగము నని తలంచితిని.