పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుంటిని గాని నాకంటె పెద్దలున్న సభలలో సభాకంపము నన్నుబాధించుచుండెను. పిమ్మటికాలములో కాంగ్రెస్‌సభలలో ఇట్టి మనోదౌర్బల్యముచేతనే ఇంగ్లీషునం దుపన్యసించుట మానవలసివచ్చెను. నేను కాంగ్రెస్‌నాయకులలో తగినంత ప్రాధాన్యము వహించకపోవుటకును ఇది యొక గొప్పకారణము. ఒక కాంగ్రెసు మహాసభలో తెంపుచేసి భాషణచేయవలెనని యూహించుకొని ఏదో తీరుమానమునుగూర్చి మాట్లాడుటకునాపేరు ఈయబోగా శ్రీ చక్తవర్తుల రాజగోపాలాచార్యులుగారు అంత మహాసభలో మన మాటలు వినబడవు గనుక అందుకు ప్రయత్నించవలదని నాకు సలహా నిచ్చెను. అప్పటినుండి ఆప్రయత్నమే మానివేసితిని. విషయనిర్ణయసభలోమాత్రము అపుడపుడు మాట్లాడుచుంటిని. అఖిలభారతకాంగ్రెసుకార్యనిర్వాహకసభలో సభ్యుడుగా నున్నపుడుగాని అధ్యక్షుడుగా నున్నపుడుగాని నేను చాల మితభాషినని పేరుపొందితిని. ఇందుకు పైన చెప్పిన సభాకంపమే కారణము.

బందరులో నున్న పదునొకండు సంవత్సరములకాలము చక్కగనే గడచిపోయినది. కుటుంబములో పిల్లలను కోల్పోయిన దు:ఖముతప్ప తక్కినవిషయములలో నుత్సాహముతో నా యౌవనమునందు ప్రధానమైన ఘట్టము గడచిపోయినది. అచ్చటి స్నేహితులతో కలసిమెలసి ప్రవర్తించుటవలన కలిగిన యనుభవములు పిమ్మటికాలములో చాల నుపయుక్తముగ పరిణమించిన వనుటకు సందియములేదు. అప్పుడచ్చట ఆంగ్లేయవిద్యాధికులలో ముఖ్యముగా యువకులగు న్యాయవాదులలో దేశహితైక