పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అప్పుడు బి. ఎల్. మూడుసంవత్సరములు చదువవలసి యుండెను. బి. ఏ. చదువుచుండగనే బి. ఎల్. లోగూడ చేరి చదువుటకు అవకాశముండెను. గాన ఒకసంవత్సరము కలిసివచ్చునను తాత్పర్యముతో బి. ఏ. సీనియరు చదువుచుండగనే బి. ఎల్. లో చేరితిని. అపుడు సముద్రపుటొడ్డున మెరీనాయెదుట ప్రెసిడెన్సికాలేజీలో బి. ఎల్. క్లాసులు పెట్టుచుండిరి. అందుకు హైకోర్టులాయర్లు ఉపన్యాసకర్తలుగనుండిరి. విద్యార్థులు హాజరైనట్లు క్లాసువెలుపల రిజష్టరులో దస్కతుచేయుటమాత్రమే కాని మేము క్లాసుకు హాజరైనది లేనిది విచారించు వా రెవ్వరును లేకుండిరి. ఓపిక ఉన్నంతవరకు శ్రద్ధగలవారు వినుచుండెడివారు. లేనివారు క్లాసులోనికి రాకుండనే రిజిష్టరులో దస్కతుచేసి వెలుపల మెరీనాలో షికారుచేయుచుండెడివారు. సామాన్యముగ సాయంకాలము 5 గంటలకు పిమ్మటనే ఈక్లాసులు జరుగుచుండుటచేత క్రైస్తవకళాశాలలో క్లాసులు ముగిసినతర్వాత అచ్చటికి పోవుటకు అవకాశముండెను. సామాన్యముగ కాలినడకను బోవుచుండెడివారము. హనుమంతురావు బి. ఎల్. లో నావలె చేరలేదు. నేనైననూ బి. ఎల్. లో చేరితినన్న మాటయే కాని చదువు పూజ్యమే. బి. ఏ. చదివి అది పూర్తిచేయుటకే శ్రద్ధవహించి, అందుత్తీర్ణుడనైతిని, కానిమొదటిసంవత్సరము బి.ఎల్. చదువనికారణమున బి. ఎల్. పరీక్షకు ముమ్మారు బోయి మూడవసారి కృతార్థుడనగుట సంభవించెను. హనుమంతరావు చదువుకాలమునకు బి. ఎల్. రెండుసంవత్సరములుమాత్రమే చదువవచ్చునని నిర్ణయమయ్యెను. అతడు రెండవయేట తప్పిపోయెను. కావున నాతోపాటుగనే కృతార్థుడయ్యెను.