పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రామలింగయ్యయను తెలుగుబ్రాహ్మణుడు పెట్టిన హోటలులో ఏర్పరచుకొంటిమి గాన తెలుగు భోజనముగూడ సమకూడెను.

ఇంతలో డాక్టరు మిల్లరుగారు మరల చెన్నపట్టణము వచ్చి కళాశాలాధ్యక్షతను బూనెను. సమ్మెవిషయము ఆయనకు మిక్కిలి పరితాపము కల్గించెను. అందుచే ఆసమ్మెలో పాల్గొనిన కొందరు ముఖ్యులను పిలిపించి జరిగిన వృత్తాంతమును సావధానముగ చెప్పవలసినదని కోరిరి. నేను జరిగినదంతయు చెప్పెతిని. "ఒకకంటితో మిమ్ముచూచుచున్నంతవరకు మీరు చక్కగనే ప్రవర్తించుచుందురు. చూచువారు లేనప్పుడు మీరు త్రోవ తప్పుదురు. అదిగాక స్వభావము, నడవడి (Character and Conduct) వీని రెంటికినిగల తారతమ్యమును ఎవ్వరును సాధారణముగ గ్రహించరు. మనుజునిస్వభావము మారునది గాదు. నడవడిని మాత్రము ముఖ్యముగ దిద్దుకొనుచుండవలెను. నడవడి అప్పటప్పటికి మారుచుండును" అనుచు, లాయిడ్‌గారి ఆనాటి వర్తనముగూర్చి ఏమియు అనక మిక్కిలి ఆదరముతో ముచ్చటించెను. తుదకు సంభాషణ ముగించుచు, ఇంతవరకును మిమ్ము నాబాలకులారా (my boys) యని పిలుచుచుంటిని. ఇకముందు నా బిడ్డలారా (my children) అని పిలిచెదనని వాక్రుచ్చి, నన్ను దగ్గిరకు బిలిచి నాచెంపమీద తన యరచేతితో నెమ్మదిగ కొట్టి నవ్వుచు మమ్ము నందర వెళ్ళిపొమ్మని ఆనతిచ్చెను. మేము ఆయన ఔదార్యమును మెచ్చుకొని వారే ఆసమయమున నుండిన ఇంత జరిగియుండదని అనుకొంటిమి. పిమ్మట కొలది కాలమునకు బి. ఏ. పరీక్షలు గడచినవి. అందు నేనును హనుమంతురావును సెకండుక్లాసులో కృతార్థులమైతిమి.