పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


హనుమంతరావు బి. ఎల్. మొదటిసారి తప్పినపిమ్మట గుంటూరు హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి కాలముజరుపుచుండెను. నా కీమధ్యనే కార్యమైనందునను మాయత్తవారి కుటుంబవిషయములు నేను విచారించవలసివచ్చినందునను లింగమగుంటలో ఎక్కువకాలము గడపుట సంభవించినది. ఇందువల్ల నా బి. ఎల్. చదువుగూడ కొంత భంగమైనదని చెప్పవచ్చును.

కాంగ్రెసు - దివ్యజ్ఞానము

నేను బి. ఏ. జూనియర్ చదువుచుండగనే భారత దేశీయ మహాసభ (Indian National Congress) మూడవసమావేశము 1887 డిసెంబరులో చెన్నపట్టణములో జరిగినది. అప్పుడు నేనును, హనుమంతురావును ఐచ్ఛికభటులుగా పనిచేసితిమి. ఆసభకు డబ్లియు. సి. బెనర్జీ యను వంగదేశీయుడు, బారిస్టరు అధ్యక్షుడుగా నుండెను. ఆజానుబాహువిగ్రహము; పెద్ద గడ్డము ఆయనవక్షస్థలమున వ్రేలాడుచుండెను. ఆయన కంఠధ్వని మేఘగర్జనమువలె నతిదూరము వినబడుచుండెను. ఆసభకు సురేంద్రనాధబెనర్జీ యను ప్రసిద్ధవక్తగూడ వచ్చియుండెను. శ్రీ గోపాలకృష్ణగోఖలేగారును, మహాదేవ గోవిందరణడేగారును ఆసభకు హాజరైరి. వారు ప్రత్యేకముగ విషయములనుగూర్చి యోచనలుచేయుచుండిరి. తిలక్‌గారు రాలేదు. పండిత మదనమోహనమాలవీయ, బాబూ బిపినచంద్రపాలును యువకులుగా