పుట:Konangi by Adavi Bapiraju.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగిని అనంతలక్ష్మి తన వేరే గదిలోనికి కొనిపోయి, అక్కడ సిద్దపరచివున్న కాఫీ బల్లఎదుట కూర్చుండబెట్టి తాను కోనంగికి ఎదురుగుండా కూర్చుండి, అతనితో ఉపాహార మారగించసాగింది.

“గురువుగారూ, ఆయన ఒక నాటుకోటి సెట్టిగారు.”

“ఏయన?”

“మీరు పాఠం చెపుతోంటే వచ్చినాయన. వట్టి రౌడీ! లక్షాధికారి! పరమ దుర్మార్గుడు. వాణ్ణి చూస్తేనే నా ఒళ్ళు మండిపోతుంది.”

“అయితే చూడకండి!”

“వాడు మా అమ్మగారిని బాగా ఎరుగును. మా కుటుంబ క్షేమంకోరే మనిషి. అందుకని తప్పనిసరిగా వాణ్ణి భరించవలసివస్తోన్నది.”

“అయితే వచ్చిన నష్టం ఏముంది? మామూలుగా వెళ్ళేటట్లుగానే వెళ్ళనియ్యండి!”

“నన్ను అండి అని మర్యాదచేయవద్దని ప్రార్థన.”

“కొన్నాళ్ళు సాగనివ్వండి.”

“మీకు మా ఇంట్లో భోజనంచేయడానికి అభ్యంతరం ఉందా? వంటమనిషి ఒక అయ్యరు. మేము మాంసాదులు తినం.”

“అయితే నా కేమీ మీ ఇంట్లో తినడం అభ్యంతరంలేదు.”

వారు కాఫీ త్రాగుతున్నారు. చెట్టియారుగారు అనంతలక్ష్మి చదువులగదిలో కూర్చుండి ఎంతకూ రాలేదేమని అనుకుంటూ ఉండగా కారు బర్రుమన్న చప్పుడు విన్నాడు.

అమ్మయ్యా! ఆ శనిగాడు వదిలాడు. వీడెక్కడ నుంచి దాపురించాడు? వీణ్ణి వదలించాలి. తాను ఎంతమంది పడుచుఉపాధ్యాయుల్ని అనంతలక్ష్మి ఇంటికి రాకుండా చేయలేదు! ఎలాచేయగలిగాడో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళేందుకు రావడం మానినారో అనంతలక్ష్మికీ తెలియదు, జయలక్ష్మికి అంతకన్నా తెలియదు.

ఇంకా రాదే అనంతలక్ష్మి! అని చెట్టియారుగారు గబగబ లేచారు. ముందు వరండాలోకి వచ్చారు. అక్కడ వున్న ఒక వస్తాదును "అనంతలక్ష్మి ఎక్కడ?” అని ప్రశ్నించాడు.

“అనంతలక్ష్మా?”

“ఆమ!”

“నా కేమి తెలుసు?”

“కారుమీద ఆ అయ్యవారు వెళ్ళినారా?”

“ఆ అయ్యవారా? ఇందాక వచ్చిన అయ్యవారా?”

“ఆమ!”

“నా కేమి తెలియును?”

కోపంతో చెట్టియారుగారు లోపలికి వెళ్ళి పరిచారిక నడిగారు. ఆమె “చిన్నమ్మగారు కారుమీద వెళ్ళారు” అని అన్నది.

“ఎప్పుడు?”

“ఇప్పుడే.”

“ఇప్పుడే.”

“ఇప్పుడే.”

“ఏ కారుమీద?”