పుట:Konangi by Adavi Bapiraju.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెట్టి “తెలుగుదానే నేరుస్తుండవు లక్ష్మీ!” అని లోపలికి వచ్చి, ఆ పక్క కుర్చీపై చతికిలపడ్డాడు. ప్రపంచంలో ఎన్నిచోట్లయినా జయించుకు రాగలిగిన కోనంగి, ఆనంతలక్ష్మి ఎదుట గజగజలాడుతున్నాడు. అతనికి తెలుసును. తెలిసిపోయింది, కావ్యాల్లో నాయకులకు తప్ప ఇతరులకు పట్టని మహత్తరావస్థ ఒకటి తనకు పట్టిందనీ, అనంతలక్ష్మి అనే ఒక అద్బుత దివ్యసుందరాంగి తన ప్రేమ నిధానము అయి చక్కాబోయిందనీ.

ఆమెను చూచిన క్షణాతిక్షణంలో ఆ నిజం ఒక్కసారి వెలిగిన వేయి విద్యుద్దీపాలులా అతనికి తెలిసిపోయింది.

అలాంటి ఒక పరమ మధుర “మత్తు” లోపడి పాఠం చెబుతున్నాడు. మూడుసారులు నత్తి కూడా వచ్చింది. అట్టి సందర్భంలో దేవుడులా వచ్చాడీ మహానుభావుడు. ఎవరీ పెద్దమనిషి, వాడి పుణ్యమా అని.

6

“ఈవాళ కింతే చాలు. నాకు చాలా పని ఉంది వెళ్ళాలి” అని కోనంగి అన్నాడు.

“కొంచెం కాఫీ తీసుకుని వెళ్ళండి గురువుగారూ!” అని అనంతలక్ష్మి కోనంగిని ప్రార్థించింది.

“నాకు వ్యవధిలేదు. క్షమించండి” అని కోనంగి మనవిచేసి తలతిప్పి అనంతలక్ష్మికి, చెట్టియారుగారికి నమస్కారంచేసి లేచినాడు.

“మా కారు మిమ్ముదిగబెడుతుం”దని అనంతలక్ష్మి పరిచారికను పిలవడానికి లోనికి పరుగిడింది.

చెట్టియారు: ఎంగళది ఎందూరు?

కోనంగి: అరవపేశం నాకు రాదు స్వామీ!

చెట్టియారు: మీరుదా ఎందా ఊరా?

కోనంగి: బందరు..

చెట్టి: ఇక్కడదా, ఏమి చేస్తురు?

కోనంగి: ఉద్యోగం చేస్తునుదా!

చెట్టి: ఎక్కడదా ఉద్యోగం?

కోనంగి: ఒక మరాట్ట సంస్థలోదా!

చెట్టి: సమస్తా? అది ఎన్న?

కోనంగి: అది పొన్ను!

చెట్టి: బంగారం బేపారందానే?

కోనంగి: బంగారంవంటి అశన బేపారందా!

చెట్టి: అశన అంటే ఏమిటిద?

కోనంగి: కుక్షింబరత్వందా!

చెట్టి: అది ఎన్న?

కోనంగి: అది వెన్న....

ఇంతలో అనంతలక్ష్మి వచ్చి “గురువుగారూ! రండి” అని పిలుచుకు చక్కాపోయింది చెట్టియారుగారు మండిపోయారు. ఈ చదువు చెప్పడం వ్యాపారం త్వరలో ముగింపించాలి అని అయిన పళ్ళు బిగించాడు.