పుట:Konangi by Adavi Bapiraju.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“తన కారుమీదే.?”

“అది కొత్త అయ్యవారిని పంపించడానికి వెళ్ళిందికాదా?”

“అవును.

“అందుమీద ఎల్లా వెళ్ళింది?”

“అందుమీదే వెళ్ళింది.”

7

చెట్టియారుగారు ఏడ్చినంత పని చేశారు. అనంతలక్ష్మి తన్ను తప్పించుకోనేందుకు వేసిన ఎత్తు ఇది అని ఆయనకు తెలుసు. అతనికి మరి కొంచెం పట్టుదల ఎక్కువ అయింది. కళ్ళు తుడుచుకొని పళ్ళు బిగించాడు. వెంటనే జయలక్ష్మితోనన్నా మాట్లాడకుండా కారెక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు పనిమనిషి చూచింది. వెళ్ళనిచ్చి జయలక్ష్మితో చెప్పింది. అయ్యో! కాబోయే ఆల్లుడికి కోపం వచ్చింది కాబోలు ననుకొని, జయలక్ష్మి పరిచారికను అన్ని విషయాలూ అడిగింది.

ఆ రోజున గేటు దగ్గర నిలుచున్నవాడే, తన్ను “ప్రయివేటు ఉపాధ్యాయకత్వం ఏమన్నా ఉందా” అని అడిగి లేదనిపించుకున్నవాడేనా ఈరోజున వచ్చాడు? వాడికీ అమ్మణ్ణికీ స్నేహం ఎక్కడ కుదిరింది చెప్మా? సాధారణంగా ఎవ్వరితోనూ సహవాసం చేయదు. తన తోటి విద్యార్థినులతో కూడా ఏ పదిమందితోనో మాత్రం చనువుగా స్నేహంగా ఉంటుంది తన అమ్మణ్ణి. అలాంటిది ఈ కొత్త అబ్బాయి ఎక్కడ దాపురించాడు.?

ఒంటిగా అనంతలక్ష్మి ఏ మగవాళ్ళతోనూ వెళ్ళదే! ఆందులో ఒక కొత్తవానితో ఎలా వెళ్ళగలిగింది చెప్మా! అని జయలక్ష్మి ఆశ్చర్యం పొందింది.

జయలక్ష్మి తబ్బిబ్బయింది. ఆవేదన పడింది. కుర్చీమీద చతికిలపడింది. తిన్నగా తనభర్త అయ్యంగారి తైలవర్ణచిత్రమున్న గదికిపోయింది. అది పూజాగృహంలా ఉంటుంది. అక్కడ సాష్టాంగపడి లేచి, చెంపలు వాయించుకొని... “అనంతలక్ష్మిని గూర్చి ఏమాలోచించారు స్వామీ” అని దీనంగా ప్రార్థించింది.

ఎంత సేపూ అయ్యంగారి బొమ్మ నవ్వినట్లే కనబడుతుంది. ఏదో ఊరట చెంది జయలక్ష్మి తాను రంగుదారాలతో కుట్టే కుట్టు పనికి పోయింది.

అనంతలక్ష్మి కోనంగిని కారులో ఎక్కమని తాను కూడ, చటుక్కున అతని పక్కకూర్చుండి కారును పొమ్మంది. మొదట ధైర్యంచేసి ఎక్కిందన్న మాటేగాని, తర్వాత సిగ్గుతో, భయంతో ముడుచుకుపోయింది. ఎవరేమను కుంటారో? తల్లి ఏమనుకుంటుంది? తానెప్పుడూ ఒంటరిగా మగవానితో ప్రయాణంచేసి ఎరుగదు. కారు డ్రైవరు తన పెద అమ్మమ్మ మనుమడు. తనకు అన్నగారి వరస. అంచేత కొంత నయం. అయినా ఈలా సరిసమానంగా ఒంటిగా ఒక పురుష పుంగవునితో ప్రయాణం చేయలేదే తాను!.

అనంతలక్ష్మికి చెమటలు పట్టాయి. కోనంగి అనంతలక్ష్మి అవస్థ చూడకుండానే గ్రహించాడు. అనంతలక్ష్మి చటుక్కున తనతోపాటు కారు ఎక్కడం, అందులో తనపక్కనే కూర్చోడం, అతనికి శృంగారావస్థలో మూర్చ వచ్చినంతపని అయింది. గుండెలు మహావేగంతో కొట్టుకొంటున్నాయి. ఏదో మత్తు అలుముకుపోయింది. నుదురు, చెంపలు, భుజాలు, వీపు వేడెక్కాయి. ఇదే మన్మథావస్థ! అమ్మయ్యో! ప్రేమ మహారోగం వచ్చి