పుట:Konangi by Adavi Bapiraju.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రయోదశ పథం

స్వప్న ప్రపంచం

కోనంగి జైలులో ఏదో స్వప్నప్రపంచంలో జీవించసాగాడు. మహామహులైన ఆంధ్రనాయకులు, తమిళ, మళయాళ, కర్ణాటక నాయకులు జైలు నిండా ఉన్నారు.

దూరాన ఉన్నప్పుడు వారు దేవతలులా తోచారు కోనంగికి. దగ్గరకు వస్తే చెమటలు పట్టే మానవులు.

వారి కోపాలు, వారి ఆశలు, వారి నిస్పృహలు, వారి అపేక్షలు దుర్బిణీయంత్రంలో కనబడినట్లయింది కోనంగికి. అతనికి భయమూ కలిగింది, అనుకంపమూ కలిగింది.

చిన్న చిన్న జాతీయవాదులు మొదటి నుంచి కోనంగికి సంపూర్ణంగా అర్థమయిన వారే! అలాగే నేడూ ప్రత్యక్షమయినారు.

కొందరికి ప్రపంచం పయిన కోపం, కొందరికి తమ పైననే కోపం. అందరికీ దేనిపైనో కోపం! కోపం లేనివారు ప్రేమించడం ఎలా సాధ్యం. కాబట్టే దేశాన్ని అకుంఠితంగా అందరూ ప్రేమిస్తారు. ఆ ప్రేమలో ఇమిడే వారి సంపూర్ణత్వాలు శ్రుతిలో కనబడ్డాయి కోనంగికి.

కాంగ్రెసు ప్రచారకులకూ, సేవకులకూ, నాయకులకూ అతడు క్రొత్తవాడు. అందరూ అతన్ని ఎరుగరు. అతని పత్రికను అందరూ ఎరుగుదురు. అందరూ అతన్ని ఎవరికివారు ఇష్టం వచ్చినట్లు భావించుకున్నారు. కొందరికి అతడు సన్నగా పొట్టిగా ఉంటాడని తోచింది కొందరు సన్నగా పొడుగ్గా ఉంటాడని మనస్సులో అనుకున్నారు. కొందరి ఊహలో అతడు బంగారు ఛాయ. మరి కొందరి హృదయ దర్పణంలో అతడు నల్లగా కన్పించాడు. అతడు ఏ రంగో, ఎలా ఉంటాడో కొందరు ఊహించనేలేదు.

అందరూ అతన్ని చూడడం ఆనందంగా ఉంది అన్నారు. కొందరికి ఉడుకుబోతుతనం. కొందరు మెచ్చుకున్నారు. కొందరు బాగానే ఉంది కోనంగి పని అనుకున్నారు.

కోనంగి ఇతరులను అర్థం చేనుకుందాము అని ప్రయత్నించాడు. “కొందరిని పూర్తిగా గ్రహించగలను” అనుకున్నాడు.

“ఎందుకు వీరు స్వాతంత్ర్యంకోసం ఈలాటి బాధలు పడడం?” అని ప్రశ్నించు కున్నాడు. తన స్నేహితుడు డాక్టర్ రెడ్డి కమ్యూనిస్టు. సామ్యవాదంకోసమే పాటుపడుతున్నాను అనుకొంటాడు. ఎందుకాతనికి ఆ గొడవ?

యుద్ధాలకు వెడతారు ప్రాణాలకు వెరవకుండా! దేనికీ వెరవకుండా ప్రాణాలు బలి తీసుకుంటారు.

ఆలోచించినకొలదీ కోనంగికి ఆవేశోత్సాహం కలిగింది. అతడు సర్వవిశ్వమూ తిరిగి వస్తాడు. ఆ విశ్వాన్ని ఎన్ని రకాలుగా దర్శింపవచ్చును? ఆ దర్శించడము భయకారణమూ, ఆనందయుతమూ, హాస్యపూర్ణమూ ఔతుంది.