పుట:Konangi by Adavi Bapiraju.pdf/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

అతడ్లి కోర్టు అవరణలో అనంతలక్ష్మి, జయలక్ష్మీ, మధుసూదనుడు. రియాసత్ ఆలీ, సరోజినీ, చౌధురాణీ, డాక్టరు రెడ్డి కలుసుకున్నారు. అనంతలక్ష్మి గర్భవతి అని తెలియజేశారు. కోనంగి ఆశ్చర్యానికీ, ఆనందానికీ మేరలేదు. ఆ కోర్టు భవనంలో భార్యాభర్తలిరువురూ విడిగా కలుసుకునే ఏర్పాటు జరిగింది. కోనంగి వెంటనే అతిప్రేమతో భార్యను కౌగలించుకొని, ఆమెకు దివ్యహృదయ స్పందన స్వరూపాలయిన ముద్దులర్పించాడు. “నన్ను క్షమింపరూ మాష్టరుగారూ?” “అనంతా! నా జీవితానివి, నా సర్వస్వానివి. నేను నిన్ను క్షమించడమా?” అనంతలక్ష్మి భర్త రెండు భుజాలు పట్టి, తల పైకి ఎత్తి అతని మోము తనివ్వ తిలకిస్తూ “మీరు ఎప్పుడు వస్తారో! ధైర్యంగా ఉండండి! మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను” అని అంటూ అంటూ అతని తల వంచి పెదవులపై ముద్దుపెట్టింది. “నీ ముద్దులో పాపాయి ముద్దును కూడా రుచి చూస్తున్నాను ఆత్మేశ్వరీ!” “నా యీ రెండు పెదవులలో ఏది పాపాయి పెదవి?” “పై పెదవే పాపాయి పెదవి అనంతా! జాగ్రత్త, నీ మనస్సు నిర్మలంగా ఉంచుకో. నీ ధనం నీదేశంకోసం సర్వకాలమూ మానవసేవ మసస్సులో తలచుకో! సంతోషంగా ఉండు. లోని పాపాయి ఆరోగ్యం మరువకు. డాక్టరు సహాయం పొందుతూ ఉండు. “గురువుగారూ! నేను రావాలనే అనుకున్నాను.” “జైలులోనే పురుడుపోయవలసి వచ్చేది.” “అయితే ఎంతో ఆనందంగా ఉండును.” “ఆనందమానందమో! కానీ పండులాంటి తొనల పాపాయిని ఎత్తుకొని ఉండగా తిరిగి వస్తానులే!” “ఎవరిపోలిక?” “నీ పోలికే!” “మగపిల్లవానికి, ఆడవారి పోలిక ఏమి బాగుంటుంది? మీ పోలిక అద్భుతం” “పోలిక అనగానే ఆడపిల్లవాడు పుట్టాడనా?” “ఏమో బాబూ! నా పోలిక వస్తే అడపిల్లవాడే ఔతాడేమో!” ఆమె పకపక నవ్వింది. అతడూ నవ్వాడు. “ఆడపిల్లకు తండ్రిపోలిక రావాలట!” “ఐతే నాకు ఆడపిల్లే కావాలండీ!” “అమ్మాయి వస్తే నాతో మాట్లాడవు కాబోలు!” “మీరు మరీని!” “నువ్వు మరీ-మరిని!” ఇద్దరూ కౌగలించుకున్నారు. ఆ రాత్రే కోనంగిరావును వేలూరు జయిలుకు తీసుకుపోయారు. కోనంగి (నవల) 259