పుట:Konangi by Adavi Bapiraju.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలియకుండా డాక్టరుకు కబురు పంపితే? తీరా ఏ అజీర్ణమో చేస్తే తలనొప్పి వచ్చిందేమో? హాస్యం చేసినా, ఈలాంటి వాటిల్లో ఛాందసము మంచిదేమో?

ఇంతట్లోకే “అనంతం అక్కా!” అని చౌధురాణి, “ఏమిరా కోనండీ!” అని మధుసూదనుడు. ఇంతలో ఇద్దరూ “మామయ్యగారూ!” అంటూ సరోజినీ, “వారెవా! ఏమి దంపతులండీ!” అంటూ కమలనయనా చక్కావచ్చారు.

జయలక్ష్మి హాలులోనికి వచ్చి “అమ్మిణికి వంట్లో కులాసాగా లేదు. అక్కడే ఉన్నాడు కోనంగిరావుగారు” అన్నది.

అందరూ అనంతలక్ష్మి గదిలోనికి వచ్చారు. వీళ్ళు వస్తున్నారని కోనంగి స్విచ్ నొక్కినాడు. అనంతలక్ష్మి భర్త దీపం వెలిగించే లోపునే గబగబ చీకటిలో మోము దుప్పటితో తుడుచుకొని, కళ్ళు మూసుకొని ఉంది.

దీపం వెలిగింది. అందరూ గదిలోకి వచ్చారు. మధుసూదనుడు కోనంగిని చూచి, “ఏమిరా! ఎల్లా వచ్చావు? నువ్వు వెళ్ళావు. పదినిమిషాల తర్వాత ఏమి జరిగింది బాబూ అంటూ బయటకు వచ్చాము. అప్పుడే కారు వచ్చింది. మేమూ వచ్చాము. నువ్వు ఎట్లా వచ్చావు?”

కోనంగి: నేను బస్సుమీదే వచ్చాను. నువ్వు ఎల్లా వచ్చావని నన్నొక్కణ్ణి అడుగుతావేమి?

మధు: ఆనందం మాతో చెప్పినాడు. “మా చెల్లెలు ఒక్కతే డ్రైవు చేసుకుంటూ వచ్చింది. వంట్లో బాగుండలేదు కూడా!” అని మాతో చెప్పాడు. ఏమిటో, ఎందుకో అని కంగారుపడి ఆ కారుమీద పరుగెత్తి వచ్చాము.

9

ఎప్పుడూ సంతోషంగా ఉండే కోనంగి ఎంతో కుంగిపోయినట్లయ్యాడు.

“బ్రదర్! అల్లా కుంగిపోయినట్లున్నావు?” చౌధురాణి ఎప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడుతుంది. ఇంగ్లీషులో బావను ఇంగ్లీషువారు “బ్రదర్” అనే అంటారు. ఆమెకు కోనంగి వరసకు బావే! చిన్నతనాన్నుంచీ కోనంగీ మధుసూదనూ “బావా! బావా!” అనుకునేవారు. చౌధురాణి తెలుగులో మాట్లాడినా కోనంగిని "బ్రదర్' అనే పిలుస్తుంది.

ఒక బాలికను ఎవరయినా ప్రేమిస్తే ఆ విషయాన్ని ఆ పురుషుడు ఎంత రహస్యంగా దాచుకున్నా, ఆ బాలికకు హృదయంలో ఆ విషయం స్పర్శత నందుతుంది. చౌధురాణికి డాక్టరు రెడ్డి హృదయం అర్థమయింది. డాక్టరు రెడ్డి ఆమెకు ఒక విచిత్ర వ్యక్తిగానే కనిపించాడు. ఈయన కమ్యూనిస్టు అని కోనంగిరావు అన్నాడు. చాలామంచివాడు, పేరుపొందిన డాక్టరు, సంస్కారి అనీ కోనంగి బ్రదర్ అన్నాడు.

మాటయాసా, ఇంకా ఒకటీ రెండు విషయాలలో తప్ప డాక్టరు రెడ్డిగారు బ్రాహ్మణునిలా ఉంటాడు. బ్రాహ్మణుడు కాదా అన్న ప్రశ్న తనకెందుకూ? తనకు కులాలూ, గొడవలు ఉన్నాయా? రెడ్డి ఎవరయితే తనకేమి అనుకుంది.

కాని ఎదుట ఒక హృదయం ఆమెపై ప్రేమతో వీణతీగలై మ్రోగుతూ ఉంటే, ఆమె హృదయంలో శ్రుతితీగలే ఉంటే, అవన్నీ ప్రతి స్పందన అయి మ్రోగవలసిందే కదా!