పుట:Konangi by Adavi Bapiraju.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెడ్డి తన జోలికి రాలేదు. తన ఎదుటకు వచ్చి నాల్గయిదుసారులు మాత్రం అందరితోపాటు కూర్చున్నాడు. ఏదో మాట్లాడినాడు.

రెడ్డి అందరితోనూ అతిచనువుగా మాట్లాడేవాడు. ఆమెతో సాధారణంగా మాట్లాడడు. ఆ విషయం ఆమె గమనించకపోలేదు.

ఆమెకు డాక్టరు రెడ్డి విషయం ఎందుకో అస్తమానం మనస్సుకు రావడం ప్రారంభించింది. కొన్నాళ్ళకు ఆ రావడం కొంచెం కొంచెం కంగారు పెట్టడం ప్రారంభించింది.

అందుచేత చౌధురాణి పదిసార్లు తన సోదరునితో సమానుడయిన కోనంగి దగ్గరకు రాసాగింది. కోనంగి చిన్నతనంలో అంటే పది, పన్నెండు పదమూడు ఆ ప్రాంతాల “నిన్ను పెళ్ళిచేసుకుంటాను కోనంగి బావా!” అనేది. పధ్నాలుగు, పదిహేను సంవత్సరాలలో మాట అనకపోయినా కోనంగిని ప్రేమిస్తున్నానని అనుకుంటూ అతన్ని ప్రేమించిన దానివలె నడతలో చూపించేది.

కోనంగి నవ్వుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ కలుసుకుంటూ ఉన్నా కోనంగికి ప్రణయలేఖలు వ్రాసి చెల్లెలు కమలనయనచేత పంపించేది. అవన్నీ మధుసూదనునకు చూపిస్తే కోనంగీ, మధూ ఇద్దరూ నవ్వుకొనేవారు. “పోనీ మా చెల్లెలిని పెళ్ళి చేసుకోరాదట్రా?” అని మధు కోనంగిని అడిగేవాడు. కోనంగి “ఒరే! నాకు చెల్లెళ్ళులేరు. వీరిద్దరూ నా చెల్లెళ్ళు. చౌధు నన్ను నిజంగా ప్రేమిస్తుందనా నీ ఉద్దేశం! అదీ ఒక తియ్యటి ఫాషన్” అన్నాడు.

ఇంటర్ చదివేరోజులలో ఆమెకు కోనంగిమీద ప్రణయం పొగమంచులా మాయమయింది. ఆ మొదటి దినాలలో కోనంగిని చూడడానికి సిగ్గుపడింది. తర్వాత కలుసుకొని ఆ గొడవమానేసి ఇతర విషయాలు మాట్లాడేది.

ఇంతలో కోనంగి మదరాసు వెళ్ళిపోయినాడు.

మదరాసు బయలుదేరే రోజునే చౌధురాణి కోనంగికి క్షమాపణ ఉత్తరం వ్రాసింది.

“అన్నయ్యా! నువ్వు నన్ను గురించి ఏమీ తప్పు అభిప్రాయం పడవద్దు. నేను నీకు అనుంగు చెల్లెలిని. నువ్వు నీ ఉతృష్ణ ప్రేమతో నన్ను నీ ఏకగర్భజనిత అయిన చెల్లెలిగా చూచుకొన్నావు. నాకా రోజులు చిన్నతనం. ఈనాడు నేను ప్రపంచాన్ని సరీగా అర్థం చేసుకుంటున్నాను. అన్నా! నాకు ఇద్దరు అన్నలు. ఎప్పుడూ నీకు అనుగు చెల్లెలిని.

నీ ప్రియసోదరి

చౌధు.”

అని వ్రాసింది. ఇది చూచి కోనంగి కళ్ళు చెమరించగా నవ్వుకున్నాడు. ఆ బాలిక వ్రాసిన ఉత్తరాలన్నీ తగలవేసి, ఈ ఉత్తరంమాత్రం దాచుకొని మదరాసు వచ్చినాడు.

అలాంటి చౌధురాణి తనలో తనకు అర్థంకాని ఏవేవో ఊహలు ఉద్భవిస్తే అవన్నీ చెప్పుకుందామని తనకు అన్నకన్న అన్నఅయిన కోనంగి దగ్గరకు చేరింది. కాని ఏమీ చెప్పలేదు.

నేడు తన ప్రియమైన వదిన అనంతలక్ష్మి అలా ఉండడమూ, తన అన్న ఏదో దిగాలుపడి ఉండడం చూచి ఎంతో దిగులుపడింది.

ఈలోగా మధుసూదనుడు కారు తీసుకువెళ్ళి డాక్టరు రెడ్డిని లాక్కొని వచ్చాడు.