పుట:Konangi by Adavi Bapiraju.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగి తన భార్య ఎందుకో వెళ్ళిందనుకున్నాడు. అయిదు నిమిషాలలో కథా భాగాల అనుసరణలో నిమగ్నుడయ్యాడు. పదినిమిషాలయింది. అనంతలక్ష్మి రాలేదు. అతని మనస్సు ఎందుకో చెదిరి మళ్ళీ కథవైపు ప్రసరింపలేదు.

ఇరవై నిమిషాలయింది. అనంతలక్ష్మి రాలేదు. ఏదో కంగారు పుట్టి లేచి బయటకు వచ్చి, తన భార్య కారు ఆపుచేసి వుంచిన స్థలం దగ్గరకువస్తే, కారూలేదు, అనంతమూ లేదు. కారువేసుకు వెళ్ళిందా? వెళ్తే ఇంటికేనా, లేక ఏదయినా పనిమీద ఎక్కడికైనా వెళ్ళిందా? అలా వెడితే స్నేహితురాండ్ర ఇళ్ళకు మాత్రం వెడుతుంది. ఈ మధ్య తనతో చెప్పకుండా ఎక్కడకూ వెళ్ళటంలేదే! వంటో బాగుండక తక్కినవారి ఉత్సాహం పాడుచేయడం ఎందుకని ఆమె వెళ్లిపోయి ఉంటుంది! అతడు గబగబ బస్సు ఆగేచోటికి పోయి బస్సు ఎక్కి యింటికి చేరినాడు. గదిలో మంచంమీద ఆనంతం పడుకొని ఉంది. జయలక్ష్మి కుమార్తె పక్కలో కూర్చుండి, 'కాఫీ తాగమ్మా' అని బ్రతిమాలుతూ ఉన్నది.

కోనంగి వస్తూనే “ఏమిటండీ అత్తగారూ? అనంతానికి వంట్లో బాగా లేదా ఏమిటి?” అని కంగారుగా మాట్లాడి మంచం దగ్గరకు ఉరికినాడు. జయలక్ష్మి “అమ్మాయిచేత మందు తాగించు నాయనా! నాకు పని ఉంది!”

“అసలు ఏమిటి? డాక్టరుకు కబురు పంపినారా?”

“కంగారు పడకు, ఏదో కొంచెం తలనొప్పిగా ఉందంది!” జయలక్ష్మి వెళ్ళిపోయింది.

కోనంగి భార్య ప్రక్కను కూర్చుండి, ఆమె నుదుటిపై చేయివైచి చూచాడు. నాడి చూచాడు. నాడి ఏదో కొంత వేగంగా ఉంది. కాని జ్వరం ఏమీ లేదు. కోనంగి ఆమెను దగ్గరగా లాక్కొని, మోము తనవైపు తిప్పుకొని, ఆమె కన్నులవెంట నీరు ధారగా ప్రవహించడం చూచి, “అనంతం!” అని తన కళ్ళలో నీరు తిరిగినంతపని కాగా, ఆమె కన్నులు చుంబించాడు.

మూసిన కన్నులు అనంతం తెరవదు. భార్యను మరీ హృదయానికి అదుముకున్నాడు.

“కాఫీ త్రాగు అనంతం!”

అనంతం మాట్లాడలేదు

“బాగాలేదా, కాఫీ సయించలేదా?”

అనంతం మాట్లాడలేదు. కోనంగికి ఆదుర్గా ఎక్కువయింది.

“నీవంట్లో బాగా ఉండలేదా? వెంటనే చెప్పు, మన డాక్టరు గారిని పిలుచుకు వస్తాను.”

“నాకు తలనొప్పిగా ఉన్నది. మీరు ఊరికే నన్ను మాట్లాడించకండి. నాకు కాఫీ వద్దు, డాక్టరూ వద్దు. మీరు కాసేపు పడుకోనివ్వండి. నన్ను ఎవరయినా ముట్టుకుంటే నాకు తేళ్ళూ జెర్రులూ పాకినట్లుంది.”

కోనంగి కొంచెం కించపడి, లేచి విద్యుద్దీపం ఆర్పివేసి, దూరంగా ఆ గదిలో ఉన్న సోఫాపై కుంగిపోయి కూర్చున్నాడు.

అనంతానికి, ఎప్పుడూ పెంకితనంలేదు. ఆ బాలికకు తనపై ఉన్న ప్రేమ అనంతము, జగదద్భుతముకదా! నిజంగా జబ్బుచేసిందా? వట్టి గోలపిల్లవడంచేత వంట్లో బాగుండకపోయినా, ఏదో అనుకొంటుందేమో. పసితనం వదలని ఈ పరమ సుందరిలోన ఏదోగా ఉండడంవల్ల అది తెలియక చీకాకు పడుతుందేమో అనుకున్నాడు. ఈ బాలికకు