పుట:Konangi by Adavi Bapiraju.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఓయి వెర్రివాడా, నీ ప్రేమవల్ల నీకు ఆనందం కలిగితే, దానివల్ల కళారూపం సృష్టించ వాంఛ కలిగితే, అలా కవిత్వం ఉద్భవిస్తే, నీ భావాలే సర్వమానవభావాలు కాబట్టి, వారాకవిత్వం విని రసానందం అనుభవిస్తే, ఇదంతా పారిపోయేతనం అంటావు. నీ ప్రేమ పారిపోయేతనం కాదూ? అందరి ప్రేమలూ పారిపోయేతనాలు కావూ? ఈ పారిపోయేతనాలు పనికివస్తాయా! కళలో పారిపోయేతనాలు పనికి రావూ?”

“ఇంత పెద్దలెక్చరిచ్చావు, నాడి సరిగ్గా ఉందో లేదో నన్ను చూడనీ!”

“నాకేమీ జబ్బు లేదుగాని, నీకు చేసేటట్లున్నది, నాలుగురోజులు వరుసగా ఆ అమ్మాయిని కనుక్కోకపోతే.”

డాక్టరు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం కోనంగి, అనంతలక్ష్మి, మధుసూదనూ, సరోజినీ, చౌధురాణీ అందరూ కలిసి సినీమాకు పోయారు. రెండు మూడు సారులు చౌధురాణి వెనుకసీటులో నుంచి, ముందుసీటులో కారు నడుపుతూ ఉన్న అనంతలక్ష్మి ప్రక్కను కూర్చునివున్న కోనంగిని “అన్నా! ఏమవుతుందంటావు క్రిప్పు రాయబారం?” అని అడిగింది.

అనంతలక్ష్మి క్రీగంటితో ఈ దృశ్యమంతా చూసింది. పళ్ళు బిగపట్టి కారు సినిమాహాలుకు పోనిచ్చింది.

8

అనంతలక్ష్మి సినీమాలో చల్లగా, చప్పగా కూర్చున్నదని ఎవ్వరూ చూడలేదు. అది 'పతి' సినిమా. సారధివారి సారధి రామబ్రహ్మంగారు సారధిత్వం వహించిన ‘రూపవాణి' శిలప్పాధికారగాథ తెరమీద కెక్కిన చిత్రం. సెట్టింగులు, అలంకారాలు అతిచక్కగా ఉన్నవి. తారాగణం ఆకాశంలో నిర్మల నీలాకాశంలో తారలే. సంగీతం ఫరవాలేదు. సారధత్వం ప్రతిభతో నడిచింది. కాని కథ మాత్రం చిత్రానికి అనువైనదికాదు.

ఆంధ్రదేశంలో పెద్ద ప్రదర్శనశాలలలో పదహారు వారాలన్నా చిత్రం నడిస్తే డబ్బు వచ్చిందన్నమాటే. ఆడవాళ్ళు చిత్రం చూడడానికి వచ్చిహాలంతా ఏడుపులతో నింపితేగాని ధనం వారలుకట్టదు. ఆడవాళ్ళు హడలిజేజారై రావడం మానితే. ఆరురోజుల్లో సినీమా ప్రదర్శనం ఆఖరు.

ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాడు కోనంగి. అనంతలక్ష్మి భర్త మోము మూడుసారులు చూచింది. ఆలోచనాదీనమయివున్న అతని మోము ఆ కనుచీకటిలో ఎవరో ఒక కొత్తవాని మోములా తోచింది. అనంతలక్ష్మి హృదయంలో రాబోయే వాన మొదటి చినుకులా, అనుమానపు రాళ్ళవాన మొదటిరాతి చినుకుపడింది.

పేపరులో సంపూర్ణంగా మునిగిపోయి తన్ను మరచిపోయినారా! బందరులో తన్ను అక్కా అని పిలిచింది చౌధురాణి ఈ రోజు “అన్నా, అని కోనంగిరావుగారిని పలకరిస్తోంది. ఏవో రాజకీయాల వాదప్రతివాదనలేగాని ప్రేమ సంభాషణలలో, ప్రణయ విలాసాలలో ముంచెత్తు తన మనోనాయకుడు ఈ దినాలలో దూరంగా ఉంటున్నారు. ఆమె రెండు మూడుసారులు కోనంగి చౌధురాణితో ఏవో రహస్య మంత్రాంగాలు సలుపుతూ ఉండడం చూసింది.

అనంతలక్ష్మి చిత్రంలో కూర్చోలేకపోయింది. చటుక్కునలేచి, అప్పుడే వస్తానని బయటకు పోయింది.