పుట:Konangi by Adavi Bapiraju.pdf/236

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

5

జపాను విజృంభణ మహావేగంతో ఆపరానిదై సాగిపోతూ ఉన్నది. ఫిలిఫైన్సు దీవులు పూర్తిగా ఆక్రమించుకొంటున్నాడు. ఇటు మలయాలోకి దిగాడు. ఇంగ్లీషువారి సైనికబలం, అమెరికావారి యుద్ధబలం జపానువారి ధాటీముందు ఏమీ నిలువలేక పోతున్నాయి. గుమ్మడికాయ తగిలినట్లు వారి పురోగమనము నిరాటంకముగా సాగిపోతూ వుంది.

“నన్నెవ్వరాపలే రీవేళ నాధాటికోర్వలే రీవేళ” అని బసవరాజుగారన్నట్లు జపాను నావికాబలాలు ఫసిఫిక్కుమహా సముద్రంలో చిన్న చిన్న ద్వీపాల్ని ఆక్రమించుకున్నాయి. వారి విమానదాడులు దోమల ముసురూ. మిడతలదండులా రావడమే! రంగూన్ నాశనమైపోయింది. సాగినారు జపానువారు.

ఇంగ్లీషు సైన్యాలు, వారితోబాటు భారతీయ సైన్యాలు వెనక్కు వెళ్ళుతున్నాయి.

“ఎందుకు ప్రభుత్వంవారు సరియయిన విమానాలూ, టాంకులూ, తుపాకులూ, ఫిరంగులూ పంపించరూ?” అన్న ప్రశ్నవేశాడు. ఆ ప్రశ్నలోనే “జపానును అరికట్టండి” అని పెద్దవ్యాసం డాక్టరు వ్రాసినాడు.

అటు ఉత్తర ఆఫ్రికాలో రోమైల్ సేనాని ఇంగ్లీషు సైన్యాలను తరుముకుంటూ వచ్చి 1941 జూలై ఐదుకు అలెగ్జాండ్రా దగ్గర మకాంవేశాడు. ఆ సంవత్సరం స్టాలిన్గ్రాడు పట్టుకుందామని ప్రయత్నించిన జర్మనులు సెప్టెంబరులో పూర్తిగా విఫలులైపోయి 23-వ తారీఖున తిరుగుముఖం వట్టారు. నవంబరులో ఫ్రాన్సు పూర్తిగా జర్మన్ల వశమైపోయింది డిశంబరు 1-వ తేదీని టోబ్రూకును బ్రిటిషుసేనలు పట్టుకున్నాయి. డిశంబరు 24-వ తేదీని అడ్మిరల్ డార్లానులు ఎవరో హత్యచేశారు.

1942-వ సంవత్సరంలో జపాను వారు మానిల్లా ఆక్రమించుకున్నారు. ఫిబ్రవరిలో సింగపూరు పడిపోయింది. ఏప్రియల్లో అనంతలక్ష్మి పరీక్షలయాయి. రంగూన్ పతనమైపోయింది. మాండలే పతనమైపోయింది. జపాను సేనలు అస్సాంవైపు పురోగమిస్తున్నాయి ఆంగ్లప్రభుత్వంవారు క్రిపుగారిని హిందూదేశానికి ప్రభుత్వ రాయబారిగా పంపారు.

క్రిప్పురాకను గూర్చి పత్రికలన్నీ సంపాదకీయాలు వ్రాసినాయి. క్రిప్పు రావడం దేశం అంతా అల్లకల్లోలమయినది. కొందరు స్వరాజ్యపు ఛాయలైనా వస్తాయన్నారు కొందరు చర్చిలుగారినీ, ఆమెరీగారినీ ఎరగమా, దేశానికి వచ్చేదేమీలేదు. ఇంకా రెండు మూడు కేంద్రప్రభుత్వ సభ్యత్వం భారతీయులకు లభిస్తాయి అన్నారు. కొందరు మోసపోకండి అన్నారు. కొందరు వచ్చిన వీలు వదలకండి అన్నారు. క్రిప్పుగారు నాయకులందరినీ కలుసుకున్నారు. మహాత్మునితో మాట్లాడారు. రాష్ట్రపతి ఆజాదును, నెహ్రూను కలుసుకున్నారు. ఖయిదేఆజం జిన్నాగారిని కలుసుకున్నారు హిందూ మహాసభనాయకులు వీర సావర్కారుగారు, శ్యాంప్రసాదుగారూ క్రీపును కలుసుకున్నారు.

క్రిప్పుగారు కార్మికపక్షం మనుష్యుడు. ఆంగ్లరాజ్యంతోగాడ స్నేహసంబంధం కలిగి, భారతదేశం స్వాతంత్రం కలిగివుండాలని ఆయనవాదన. అందుకనే రాగానే “స్వరాజ్యం వస్తుంది. మీరంతా ఇంగ్లండు పోవడానికి మూటాముల్లే కట్టుకు సిద్దంగా ఉండండి” అని ఆయన ఇంగ్లీషు ఉద్యోగులతో నవ్వుతూ అన్నాడు, నవ్వుతూ అన్నా, ఆ నవ్వువెనుక