పుట:Konangi by Adavi Bapiraju.pdf/237

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

క్రిప్పు హృదయంలో ముచికుంభత ఉంది అని వాళ్ళు గ్రహించారు. ఆ వెంటనే వాళ్ళంతా రహస్యంగా చర్చిలుగారికి తంతివార్తలు పంపారు. వెంటనే చర్చిలుగారు క్రిప్పు గారికి, వైస్రాయి గారికి, సర్వసైన్యాధ్యక్షులయిన వేవేవ్ గారికి తాఖీదులు పంపాడు.

“తాను ప్రధానమంత్రిత్వంలో ఆంగ్లసార్వభౌముని సామ్రాజ్యంలో రాజ్యాలు రాజ్యాలుగా మాయచేయడానికి ఉద్భవించలేదు అన్న చర్చిలుగారు తన హయాములో జాతీయ మహాసభలలో పాటుపడతాడా?

“వైస్రాయి క్రిప్పు త్రిపాత్ర నాటకం ఆడారు. ఆజాద్ నెహ్రూలకు చేతులు బోర్లించి చూపారు. కాంగ్రెసు కార్యవర్గం ఏదో అవుతుందని ఢిల్లీలో సమావేశమయ్యారు. రాజగోపాలాచార్యులవారు ఏం గోల పెట్టినా కాంగ్రెసువారు వట్టి గుల్లస్వరాజ్యం తీసుకోమన్నారు. వారి మాటలకు తందానతానా అన్నారు లీగువారు.

“క్రిప్పు ప్రతిపాదనలు ఎవరికీ ఆనందం సమకూర్చవు. ఈ భయంకర యుద్ధం జరిగే రోజుల్లో బ్రిటిషు ప్రభుత్వం యుద్దమంత్రిత్వం భారతీయులకు ఇవ్వకపోతే ఏమి లాభం? ఈ సమయంలో ఆ పనే జరిగితే భారతీయులందరూ ఒక్కుమ్మడిగా లేచి జపానును తమ చేతులతో నెట్టిపారవేస్తారు.

“క్రిపు గిరి వాదన-ఉన్న 1919 సంవత్సరపు రాజ్యాంగశాసనంలోనే అధికారాలు భారతీయులకు ఇవ్వగలం అన్నది వట్టి శుష్కవాదన అని మా ఉద్దేశం. బ్రిటిషు ప్రభుత్వం తలుచుకుంటే ఎంత సేపు పార్లమెంటులో ఒక క్రొత్తశాసనం పుట్టడం?

“ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అనే ఉత్తమాశయాన్ని వట్టి వేళాకోళం చేసిన వందలకొలదీ ఆర్డినెన్సులు పోయి నిజమయిన ప్రభుత్వం ఏర్పడితే ఆంగ్ల - భారతీయ స్నేహం ఘట్టిది అయిపోవునుకదా!

“దినాలు ఏమీ బాగాలేవు యుద్ధం ఇంతట్లో ముగిసే సూచనలు లేవు. కాబట్టి కాంగ్రెసువారూ ముస్లింలీగువారూ, ప్రభుత్వంవారూ రాజీపడాలని మేము ఆశిస్తున్నాము.”

ఈలా నడిచింది కోనంగి వ్రాసిన సంపాదకీయం. ఇంతపని చేశానని, ప్రక్కగదిలో కూర్చుని ఉన్న భార్యను పిలిచి సంపాదకీయం అంతా చదివి వినిపించాడు.

“అద్భుతం!” అంది అనంతలక్ష్మి,

కోనంగి ఇటూ అటూ చూచి భార్యను ఒళ్ళోకి లాక్కొని గాఢంగా కౌగిలించి చుంబించాడు.

అనంతలక్ష్మి కోపం అభినయిస్తూ లేచి పయ్యెదా చీరకుచ్చెళ్ళూ సవరించుకొని “ఏమిటండీ మీధూర్తత్వం” అంది.

అప్పుడు కోనంగి నవ్వుతూ,

“ప్రియురాలా కోపించకు

నయగారపు ముద్దుగాదు నమ్ముము నన్నున్

స్వయముగ నీవే వచ్చిన

ప్రియ ఉప్పొంగి ముద్దుపెట్టితి నిన్నున్!

అని ఆశుధారగా కందం చదివాడు.

“కందం ఎవరయినా సులువుగా రచింపగలరు!” అని నవ్వుతూ అనంతం తన గదిలోకి పారిపోయింది.