పుట:Konangi by Adavi Bapiraju.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదని వారంటారు. నివేదనకై సమర్పించిన ప్రేమామృతపూరిత సువర్ణకలశాన్ని వారు కాలతన్నుతారు. ఆ అధికారం వారిది. పురుషుల హృదయాలను విచ్చిన్నంచేసే అధికారం వారిది.

అతడు తెలుగులో పద్యాలు వ్రాసుకున్నాడు. పాటలు వ్రాసుకున్నాడు. ఉర్దూలో ఇష్కియార్లు (ప్రేమగీతాలు) వ్రాసుకున్నాడు.

“నీకె ఈ అధికారమ్ము నీకె ఈశి

లా హృదయ కఠినత నీకై లలితచంద్రి

కా దృగంచలాలు అదియు కలుషసహిత

ప్రేమ నిత్యత నెట్లు కంపించగలవు!”

అతని ఆవేదన స్నేహితులతో ఏమని చెప్పుకోగలడు. గంభీర హృదయుడు, మితభాషి, సరసవాది, గాఢమిత్రుడు, ఉత్తమ చరిత్రుడు. అతనికి పని అంటే ఆనందము. ఒక్క నిమిషమయినా పనిలేకుండా కాలం వెళ్ళబుచ్చలేడు. అందులో ఈ ప్రేమభంగము అంతరించినప్పటి నుండీ ఒంటిగా ఉండడమూ, ఆలోచనా, మరీ వేదనాభరితాలై దుర్భరమైపోయాయి.

కోనంగి బోధించినట్లు ప్రేమను అంతర్ముఖం చేసుకొని, ఆ శక్తి తన జీవితమే ఆక్రమించేటట్లుచేసి, నిరంతర పురోగమన యోగవంతుడు కావాలి. తమ పత్రికను మహెూన్నత పథాలకు తీసుకుపోవాలి.

మెహర్ ఏమి ఆలోచిస్తుంటుంది. తమ పంతాలు, తమ రాజకీయాలు, తమ పవిత్రప్రేమను మహాగ్నితప్తంచేసి ఇంకించి వేయవలసిందేనా? ప్రేమ నీచాశయాలకు అందనిది కాదా? ప్రేమ ఎట్టి కల్మషాలనయినా నాశనంచేసే శక్తిగలది కాదా? తాను ఆమెను, ఆమె తన్నూ ఈలా వ్యర్థంగా ప్రేమించుకుంటూ లేనివి అడ్డం పెట్టుకొని కూలబడిపోవలసిందేనా? తానొక మజ్నూ, మెహరొక లైలా కావలసిందేనా? చివరికైనా లైలా తెలిసికొంది. మెహర్ తన అంత్యదశలోనైనా తన్ను సమీపిస్తుందా?

ఒకరోజున అనంతలక్ష్మి తన మెహర్ ఇంటికి వెళ్ళి మాట్లాడిందట. మెహర్ అనంతలక్ష్మి ఒళోవాలి వెక్కివెక్కి ఏడ్చిందట. ఎందుకా దుఃఖం? కాంగ్రెసులో చేరినంత మాత్రాన తాను ద్రోహం చేస్తున్నాడా ఏమిటి? కాంగ్రెసు ముస్లింలు చేసిన దోషం ఏమి? అభిప్రాయభేదాలు పనికి రావా? అంతమాత్రంతో మనుష్యులు భరింపరానంత విరోధులవుతారా?

తనకు మాత్రమా పంతం ఎందుకు? తన ప్రేమనిధానంకోసం తన భావాలు ఆహుతి చేయకూడదా?

కాని ప్రేమతో ఒకరికొకరు నిశ్చితాభిప్రాయాలను ఆహుతి ఇచ్చుకోడంకన్న వాటిని అధిగమించి, ఉత్తమపథాలలో ఐక్యం కాకూడదా? ప్రేమ ఉత్తమపథ సంచారిణి కాదా? వట్టి కామతృప్తికోసమే ప్రేమ అయితే, పశువులకు స్వంత భావాలేమిటి, ఆశయాలేమిటి? కామవాంచ గలిగి రెండు జంతువులు సంయోగానికి అడ్డంకులు లేకపోతే కలుసుకుంటాయి. కామతృప్తి నందుతాయి.

ప్రేమ కామవాంఛ కాదు. ఇరవైనాలుగు గంటలూ మనుష్యుడు కామంకోసం బ్రతకడు. కాని ఇరవైనాలుగు గంటలు కాదుకదా, ఇరవై నాలుగులక్షల గంటలు ప్రేమకోసం బ్రతకమంటే ఆలా బ్రతకడానికి సిద్దం అవుతాడు.