పుట:Konangi by Adavi Bapiraju.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టరు: అలాంటి అర్థాలుగాని, ఆ అర్థాలకు సరిపోయే అర్థాలుగాని, దగ్గర చూట్టాలయిన అర్థాలుగాని అనబోలేదు.

కోనంగి: నువ్వు అనబోయిన మాటలు, అవి మాటలో లేక ఏవో అయి ఉండాలి.

డాక్టరు: పాటలా, పద్యాలా?

కోనంగి: పాటలుకావు, పద్యాలుకావు, గద్యాలుకావు, వచనాలుకావు, పద్యగద్యాలు కావు, నాటికలుకావు, రాగాలుకావు, తాళాలుకావు.

డాక్టరు: అవి తప్పెట్లు, మురజలు, డిండిమాలు, బాకాలు, క్లారియసెట్లు -

కోనంగి: అవి ఒక పెద్ద జంత్రగాత్ర సమ్మేళనమాలిక!

డాక్టరు: ఇంక చాలించి నా మాట విను.

కోనంగి: అమ్మయ్యా, దారికి వచ్చాడండీ, ఇక కానీ!

డాక్టరు: ఒక్కొక్క సైజులో రెండేసి జాతుల అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఒక జాతి రంగు ఒత్తుగా ఉండేది, రెండోది సన్నగా ఉండేది. ఇవేకాక, ఇంకా అయిదారు జాతులు ఉండాలని నా వాదన.

డాక్టరుగారు ఇచ్చే వార్తలన్నీ సామ్యవాదులకు సంబంధించినవి. కోనంగీ అతడూ కలసి ఒక పక్షంవారు ఇంకో పక్షంవారిని ఆడిపోసుకునే వార్తలకు ప్రాముఖ్యత ఉండకూడదనిన్నీ, అలాంటి ఉత్తమ విషయాలను గురించి వచ్చిన ఉత్తరాలు ప్రచురించకూడదనీ నిశ్చయించుకున్నారు.

“ఏ రాజకీయ పక్షమయినా దొంగపక్షం కాకూడదు. అంతే మనం చూచుకోవాలి” అని కోనంగి అన్నాడు.

అనంతలక్ష్మి పరీక్షలయిపోయి, భర్తతోపాటు పత్రికాలయానికి వచ్చి, తాను దిట్టంగా పనిచేయడం ప్రారంభించింది. భార్యాభర్తలిద్దరూ నిజమయిన సంపాదకులయ్యారు. ఇద్దరూ కారుమీద వస్తారు. ఇద్దరూ పనిలో నిమగ్నులౌతారు. మధుసూదన కోనంగులూ, సరోజానంతలక్ష్ములూ, రియాసత్, ఒకప్పుడు డాక్టరూ కలసి ఉపాహారాలకు ఏదయినా మంచి కాఫీ హెూటలుకు పోయేవారు, లేదా తమ కార్యాలయానికే తెప్పించుకొని ఆరగించేవారు. కాఫీ మాత్రం, కార్యాలయంలో విద్యుచ్ఛక్తిస్టవుపై నీరూ, పాలూ కాచి అనంతలక్ష్మీ, సరోజినీదేవో తయారు చేసేవారు.

పేపరు ఎలాగయినా విజయవంతంగా నిర్వహించాలని వారందరూ సాయశక్తులా తంటాలు పడుతున్నారు.

ప్రతిదినమూ వారందరూ సాయంకాలం పని పూర్తికాగానే ఏబీచికో, వాహ్యాళికో పోయేవారు లేదా సినిమాకో పోయేవారు. అందరూ కలసి అనేక విషయాలు చర్చించుకునేవారు.

పత్రికా నిర్వహణ ఎంతయినా పని. అది ఆ రోజుకు ముగియగానే కాస్తసముద్రతీర విహారమో, కొంచం సినీమా ప్రదర్శనమో, క్వచిత్ మృత్తికాతైల శక్తి జనితవేగశకటవిహారమో ఒంటికి మంచిదిగాదా అని కోనంగి వాదిస్తాడు.

ఈ ఇరువురి దంపతుల ఆనందము చూస్తూ రియాసత్ ఆలీ నిట్టూర్పు విడుస్తూ వుంటాడు. తన మెహర్ ఇంక తనకు కాదు. తన ప్రేమ నిరర్థకమై మురిగిపోతుంది. ఆ ప్రేమతో తానూ హరించిపోతాడుగాక. స్త్రీలను ప్రేమిస్తాము. వారి పాదాలకడ మన సర్వమూ ధారపోస్తాము. వారు మనల ప్రేమిస్తారు. ఏ తిక్కవస్తుందో నిన్ను ప్రేమించడం