పుట:Konangi by Adavi Bapiraju.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏకాదశ పథం

సంపాదకుడు

కోనంగిరావుగారు పత్రిక ప్రారంభించి రెండు నెలలన్నా పూర్తి అయిందో లేదో జపాను పెరల్ హార్బర్ పై విరుచుకుపడింది, 1941 డిశంబరు 9-వ తారీఖున.

పత్రిక ప్రారంభించిన శుభముహూర్తం నుంచీ రియాసత్ ఆలీ విజృంభించాడు. బొంబాయి కలకత్తాలు తిరిగాడు. న్యూఢిల్లీ వెళ్ళినాడు. ప్రభుత్వం వారి వివిధ ప్రచారశాఖల ప్రచురణల పరంపరలన్నీ సంపాదించాడు అన్ని పత్రికలలో పడే మందుల కంపెనీల ప్రచురణలు “మహాత్ముల వరప్రసాదలబ్ది పంజాబ్ ఔషధాలు, మహెూత్తమ జ్యోతిష్యుల అతి నిజమయ్యే ఫలితాలు, ఎంత ముసలివాడయినా పది మోతాదుల సేవనతో ముప్పదేళ్ళ కౌమారం ఇచ్చే దివ్యౌషధాలు.” ఈలాంటి వాటి ప్రచురణ ప్రచార జైత్రయాత్రలు కొట్టుకువచ్చాడు.

రియాసత్ ఆలీ పొడుగ. అందమయినవాడు, స్పురద్రూపి. ఇంటరు బి.ఏ.లలో రెండవభాష తెలుగు పుచ్చుకున్నాడు. ఐచ్చిక విషయాలు: ఉరుదూ, అరబిక్, పర్షియన్ భాషలు.

అతనికి వరవడి మౌలానా అబ్దుల్ కలాం అజాద్. రియాసత్ తీయని తెలుగు వ్రాస్తాడు, గంభీరంగా ఉరుదూ వ్రాస్తాడు. సాధుమూర్తి. కాని కోపం వస్తే రుద్రుడు అవుతాడు. భక్తుడు. ఉదయ సాయంకాలం ప్రార్థన చేసుకుంటాడు. నిజమయిన మతభక్తుడు. తక్కిన మతాలను ద్వేషించకూడదని అతని వాదం. మతం వ్యక్తిపరమయినదని దృఢంగా నమ్ముతాడు.

ఎక్కువ బలంకలవాడు కాడుకాని, గట్టి ఆరోగ్యం కలవాడు.

అతని ప్రేమనిధానం మెహరున్నీసా! ఇద్దరూ మేనత్త మేనమామ బిడ్డలు. చిన్నతనాన్నుంచీ ఒకరిని ఒకరిని ప్రేమించుకొన్నారు. ఈనాడు రాజకీయంగా వేరు వేరు భావాలు కలిగి ఉండడంవల్ల విడిపోవలసివచ్చింది. భర్త కాంగ్రెసు, భార్య ముస్లింలీగు; యెందుకు ఉండకూడదని అతడంటాడు. భార్యాభర్తలిద్దరూ ఒకే రాజకీయ మతవిషయికాభిప్రాయాలు కలిగి ఉండాలని మెహర్ వాదన.

ఆ పరిస్థితులలో రియాసత్ తన మేనమామ ఇంటిలో ఉండలేక పత్రికా కార్యాలయానికి దగ్గరగా ఉన్న ఒక మేడలో రెండుకోట్లు, ఒక వంటయిల్లు అద్దెకు తీసుకొని ఒక ముస్లిం వంటవాణ్ణి పెట్టుకొని కాపురం ఉంటున్నాడు. ఆ వంట మనిషే అతనికి సేవకుడు. ఆ వంట మనుష్యుని పేరు ఫజిల్.

కోనంగి, రియాసత్, మధుసూదనలూ, డాక్టరు అంతకన్న అంతకన్న ఒకళ్ళో కళ్ళు విడరాని స్నేహంలో ఓలలాడిపోతున్నారు.

జపాన్ పెరల్ హార్బర్ పై విరుచుకుపడింది అనగానే నలుగురు స్నేహితులు నాలుగు రకాలుగా వ్యాఖ్యానం చేశారు.