పుట:Konangi by Adavi Bapiraju.pdf/227

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగి: నేను జపాను రష్యామీదకు ఉరుకుతుందని వ్రాయడం ఉద్దేశం జపాను యుద్ధంలోకి దిగుతుందని మాత్రమే. జర్మనీ మల్లేనే జపానూ సిద్దమయి ఉంది. జర్మనీకన్న జపానుకు నౌకాబలం చాలా ఎక్కువ అంతే తేడా!

మధు: ఇంత ఆలస్యంగా జపాను రంగస్థలంలోనికి రావడం వట్టి తెలివితక్కువ పని. ఇదివరకే జర్మనీతోపాటు వచ్చి ఉంటే రష్యా పని అయి ఉండును.

డాక్టరు: ఏమి నాయనా, నీకు రష్యామీద అంతకోపం?

మధు: నాకు రష్యామీద కోపం లేనేలేదు. నాకు కావలసినది, భారతదేశానికి విముక్తి.

రియాసత్ ఆలీ: విముక్తికోసం ప్రపంచంలోని దేశాలన్నీ కొట్టుకుచావాలా?

మధు: చావవా అంట! ఇన్నాళ్ళ నుంచి ప్రాచ్యదేశాలను పీడించుకుతిన్న పాపఫలితం ఎక్కడికి పోతుందీ?

కోనంగి: పాపఫలమో, పుణ్యఫలమో నాకు తెలియదు. కాని, జపాను తన నాశనం తానే భస్మాసురునిలా తెచ్చి పెట్టుకుంటుందని నా వాదన.

రియాసత్: అన్ని రాజ్యాలు ఈ ప్రపంచ యుద్ధంలో క్షవరం ఔతాయి. ఈ దెబ్బతోనన్నా ఈజిప్టు, లిబియా, మొరాకో, అల్జీరియా, పాలస్తీనా, ట్రాంసు జోర్డాను, సిరియా, ఇరాక్లకు విముక్తి దొరికి తీరుతుందని నా ఉద్దేశం.

డాక్టరు: చక్కని ఉద్దేశమేకాని, ఈ పట్టు ప్రపంచయుద్ధంలో జర్మనీ పుణ్యంవల్ల ప్రాచ్యదేశాలకన్నిటికీ స్వాతంత్ర్యమూ సామ్యతత్వమూ రెండూ కలిసి వస్తాయని నా నమ్మకం.

మధు: చివరదొక్కటే వస్తుందని నీ ఉద్దేశం కామేడు!

డాక్టరు: (పకపక నవ్వుతూ) కాదా మరి! ఎవరి విధానం వారికి రావాలని ఉంటుంది. ఏమి సంపాదకీయం వ్రాస్తావు కోనంగిరావ్?

కోనంగి: నేను పత్రికా ప్రపంచంలో ప్రవేశించడమే సంపాదకునిగా. అయినా ఈ రెండు నెలలు దంచేశానా, లేదా?

డాక్టరు: ఊక!

రియా: నీ సామ్యవాదం వస్తే వడ్ల దంపా డాక్టరూ?

మధు: నా ఫార్వర్డు బ్లాకు వస్తే గోధుమ దంపు.

కోనంగి: ఏమి చిత్రంగా ఉందీ మన పేపరు? నా సినిమా స్పెషల్ వ్యాసరాజంబులు అమృతంగా ఉంటున్నాయా లేదా?

డాక్టరు: నీ వ్యాసాల మాటకేంగాని, మీ ఆవిడ దంచేస్తోంది. వెనుక ఇంగ్లండులో సఫైజైట్ ఉద్యమంలో కూడా ఆడవాళ్ళ వ్యాసాలు, ఉపన్యాసాలు అంత ఘట్టిగాలేవే?

కోనంగి: మా అనంతం ఏమిటో అనుకున్నావు. నా ప్రతి సంపాదకీయం క్రింది స్త్రీ సమస్య ఒక్కొక్కటి తీసుకొని తాను ఉపసంపాదకీయం వ్రాస్తోంది.

మధు: తాను పరీక్షకు వెడుతుందా! నువ్వు ఈ పని ప్రస్తుతం నాకు వదలవమ్మా తల్లీ అని మా సరోజ అంటే వినదు! రాత్రి పాఠాలు చదువు కున్నాక, తన సంపాదకీయం వ్రాస్తోంది..

రియాసన్: సరోజినీదేవి మాత్రం తన ప్రత్యేక స్త్రీ సమస్యా చర్చల భాగము అద్భుతంగా నిర్వహిస్తోంది.

డాక్టరు: ఒక దినపత్రికలో ఒక అర్గ పేజీ, ఆఖరుకు మూడుకాలాలు స్త్రీ సమస్యలతో, వార్తలతో నింపుతోంది సరోజనీదేవి, చాలా దట్టంగా పనిచేస్తోంది.