పుట:Konangi by Adavi Bapiraju.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అశయాలు మహత్తరాలు. వాళ్ళ దేశమే అలాంటిది. ప్రపంచంలోకల్లా పొడుగాటి పెద్దనది వాళ్ళదేశములో ఉంది. ప్రపంచంలోకల్లా పెద్ద మంచినీళ్ళ చెరువు వాళ్ళ దేశంలో ఉంది అందుకనే వాళ్ళు నిర్మించుకున్న జాతీయ క్రీడావనం వేలకొలదీ చదరపు మైళ్ళుంది.

“అలాంటి అమెరికాకు ప్రజ్ఞావంతుడయిన రూజువెలు అధ్యక్షుడు. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరే ఉత్తమ పురుషుడు. శాంతికోసం వేయి విధాల ప్రయత్నించాడు. హిట్లరుకి, ముసోలినీకి స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు 'శాంతి శాంతి!' అని. కాని లాభం లేకపోయింది.

“వెనుక వుడ్రో విల్పను అధ్యక్షుడు, అమెరికా ప్రపంచ రాజకీయాలలో భాగం ఉంచుకోవాలి, తన పధ్నాలుగు సూత్రాలు ప్రపంచంలో ఆచరణలోకి రావాలి అని వాదించి తన దేశాన్నే ఒప్పించలేక కుంగిపోయాడు.”

“కాని అమెరికా ఇంగ్లండుకు, ఇప్పుడు యుద్ధంలోకి దిగిన రష్యాకు ఎంతయినా సహాయంచేస్తా నన్నది. అమెరికా 'అప్పు-కౌలు చట్టం' తీర్మానించి సహాయం చేస్తోంది.

“ఇంక రష్యా విషయంలో ఆలోచిస్తే, హిట్లరు రష్యాపైన ఉరకడం నాజీతత్వ నాశనానికే అని మా దృఢనిశ్చయం. రష్యా అమెరికాకు రెండు రెట్లున్న దేశం. అమెరికా ఎల్లా అయితే మహత్తత్వాన్ని ప్రదర్శిస్తుందో అల్లాగే రష్యా. రష్యామీద విజృంభించి ఏ మహావీరుడూ విజయం పొందలేదు. ఈనాడు రష్యా పదహారణాలూ రష్యావారిదే. రష్యాదేశం, రష్యా శీతాకాలం, రష్యా ప్రజలు సంపూర్ణంగా హిట్లరుతో ప్రతి అంగుళ దశాంశమూ యుద్ధం చేశారు. రష్యాలోనే నాజీపురుషుని గోరీనిర్మాణమై ఉందని మా నమ్మకం.

రష్యా నాయకుడు స్టాలిన్ అంటే ఉక్కుమనిషి వజ్రాన్నయినా ఖండించే ఉక్కుమనిషే. అతడే రష్యా, రష్యాయే అతడు.”

“ఇంక ఇవతల పక్షంలో హిట్లర్. హిట్లర్ లోని శక్తి ప్రాంకెయిన్ స్టెయిన్ శక్తి, జర్మనీలోని యుద్దప్రియ రాక్షసత్వం తన విజృంభణకోసం సృష్టించుకొన్న భూతం హిట్లర్. ఆ భూతానికి ఆత్మలేదు. కాబట్టి ఆ భూతాన్ని ఆ అమిత యుద్ద దాహానికే మింగేస్తుంది.”

ముసోలినీ రూపానికి భయంకరుడే. బూచివాడంటివాడు. లబ్సీనియా, శిబియా, ట్రిపోలీ, మొరాకోలవంటి చంటిబిడ్డల్ని బెదరించే పెద్దవాడు. మొదట హిట్లర్ని అలాగే బెదరించాడు! ఇప్పుడు ఎరిట్రియా, అబ్సీనియాలు క్షవరం చేసుకుంటున్నాడు.

“ఇంక మిగిలింది జపాన్. జపాను నిజంగా ప్రాచ్యదేశాలకు నాయకత్వం వహించదలచుకుంటే, చీనాతో యుద్ధం మానేసి, చీనాకు తాను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చెల్లించి, తన శక్తిని నాజీ రాక్షసత్వాన్ని నాశనం చేయడానికి ఉపయోగించాలి. కాని నాజీ యుద్దతత్వాన్ని పోలిన యుద్ధతత్వం జసానుది. ఉండి ఏ రష్యామీదో విరుచుకుపడి, ఏ ద్రోహం చేస్తుందో ఎవరికి తెలిసు?”

ఈ రకంగా కోనంగి మొదటిరోజున నవజ్యోతి' రెండవ సంపాదకీయం వ్రాశాడు. ఆ రోజు మొదటి సంపాదకీయం 'మేము' అనేది. అందులో ఆ దినపత్రిక ఆశయాలూ, కార్యక్రమమూ తెలుపుతూ ఆంధ్రదేశ సేవా, భారత జాతీయసేవా, ప్రపంచ భద్రతాభిరక్తి తమ కార్యక్రమానికి ఆధారాశయాలు అనిన్నీ, ఆంధ్రులకు ఈ నూత్న పత్రికా శిశువును పోషింప ముఖ్యబాధ్యత ఉందనిన్నీ వ్రాసినాడు.