పుట:Konangi by Adavi Bapiraju.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“సెహబాస్ స్వామీ! వాడు అయిపోయిండుదా!”

“వెనకా అల్లాగే అన్నావు?”

“ఏం చెయ్యమూ వాడితో మాట్లాడడానికి. ఆ దినం పోలీసు సబుఇనస్పెక్టరు ఒకడు వచ్చాడు. ఆ పోలీసు సబుఇనస్పెక్టరు పళ్ళెత్తు, పళ్ళతోబాటు వాడికి మెదడు ఎత్తులేదు స్వామీ!”

“అయితే వాడి మెదడు ఎత్తు అవడానికి నాలుగు కాసులు బోటునిల బెట్టండి?”

మదరాసులో చెట్టిగారు అడుగుపెట్టడంతోటే ఒక సేవకుని పిలిచి, అనంతలక్ష్మి గారింట్లో ఎవరెవరు ఉన్నారో కనుక్కు రమ్మనమని పంపించాడు..

బందరు నుండి ఆ ఉదయమే కోనంగిరావుగారూ, అనంతలక్ష్మి తిరిగి వచ్చారని వార్త తీసుకువచ్చాడు చెట్టియారుగారికి ఆయన సేవకుడు.

వాళ్ళిద్దరూ దేశాలు తిరుగుతున్నారు. భార్యాభర్తలు! ఆ కోనంగి అనంతలక్ష్మితో ఎంత ఆనందం అనుభవిస్తున్నాడో! చెట్టిగారికి కళ్ళనీళ్ళు వచ్చినంత పని అయింది.

8

జూలై నెలాఖరుకు జపాను ఏమి చేస్తుందో అని ప్రపంచం అంతటా గుసగుసలు బయలుదేరాయి. జపాను జర్మనీ పక్షం చేరుతుందని అందరికీ అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇంగ్లండు బర్మా, చీనాలకు హిమవత్ పర్వతాల గుండా ఒక రోడ్డు నిర్మించింది. దాన్నే బర్మా రోడ్డంటారు.

చీనాకు జపానుకు యుద్ధం ప్రారంభమై అప్పుడే మూడేళ్ళు దాటిపోయింది. చీనాదేశం తగ్గిపోని పట్టుదలతో పోరాడుతూంది.

జపానువారి శక్తిముందర చీనా ఎంత అనే వాదన దేశాలన్నిటిలోనూ బయలు దేరింది. భారతదేశంలో కొంతమందికి తమ రహస్య హృదయ భాగాల్లో చీనా పూర్తిగా జపానుకు లోబడి పోవలసిందే అని మహాకోర్కె కాని కాంగ్రెసువారికి జపానుమీద కోపంగా ఉండేది.

కోనంగి జపానంటే మండిపోయేవాడు. ఆసియా ఖండవాసులు ప్రపంచనాయక జాతులుగా కావాలని కోరితే వాళ్ళల్లో ఒకళ్ళకొరకు యుద్ధం చేసుకో కూడదు. తమలో ఉన్న శక్తిని కేంద్రీకరించుకొని ఇంగ్లీషు మొదలయిన సామ్రాజ్యశక్తి వినాశనం చేయాలి. అప్పుడే ప్రపంచానికి ఎంతో శ్రేయస్సనీ. శాంతి తప్పకుండా చేకూరుతుందనీ కోనంగి వాదిస్తాడు.

కోనంగి స్నేహితుడు మధుసూదనరావు భావాలు వేరు. ఎవరైతే బ్రిటిషు సామ్రాజ్య విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు అవతారపురుషులంటాడు. జర్మనీని మెచ్చుకుంటాడు. రష్యాను బూతులు తిడ్డాడు. చీనా ఆసియాకు గుదికర్ర అంటాడు. ఏభయికోట్ల జనాభాతో స్వతంత్రం కలిగి ఉండిన్నీ ఆసియా ఖండానికి ముక్తి ప్రసాదించడానికి ఏమీ ప్రయత్నం చేయలేదనిన్నీ, అదీగాక బోగందాని ఇల్లులా ప్రతి పాశ్చాత్య రాజ్యమూ వచ్చి తన్నుక పోవడానికి సిద్దమై ఉండడంచేత అనేక పట్టణాలలో, రాష్ట్రాలలో ఇంగ్లండు, ఫ్రాంసు, అమెరికా, రష్యా, జర్మనీలు అధిరాజకీయ ప్రతిపత్తులు సంపాదించుకున్నారనీ అతని వాదన.